ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల వివరాలను సేకరిస్తూ ఉండాలని అనుకుంటుంది. ఇదివరలో అయితే.. ప్రజలు ఏయే ఆర్థిక సామాజిక స్థాయుల్లో ఉన్నారో తెలుసుకుని తదనుగుణంగా వారి సంక్షేమానికి సన్నాహాలు చేయవచ్చుననేది లక్ష్యంగా ఉండేది. ఇటీవలి కాలంలో పార్టీల పోకడలు మారుతున్నాయి కాబట్టి.. ముందుగా ప్రజల వివరాలు సమగ్రంగా సేకరిస్తే, ఆ వివరాలతో ఎన్నికల సమయంలో వారిని ప్రభావితం చేయడానికి, ఇతరత్రా తమ ప్రయోజనాలు నెరవేరేలా ఆ వివరాలు వాడుకోవడానికి కుదురుతుందనేది వ్యూహంగా మారిపోయింది. ప్రభుత్వాలు నిర్వహించే సర్వేల కింద ప్రజల అనేక వివరాలు మొబైల్ ఫోను చిరునామా వంటివి అడిగితే ఓకే.. కానీ వారి బ్యాంకు ఖాతా వివరాలు, పాన్ కార్డు వివరాలు తదితరాలన్నీ సేకరించి పెట్టుకుంటున్నారు. ఇలా వ్యక్తిగత వివరాల్లోకి చొరబడిపోతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇలా ప్రజలనుంచి వారి వివరాలు సేకరించడంలో పరాకాష్ట అనదగినస్థాయికి వెళుతోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ఇప్పుడు గ్రామసచివాలయాల పరిధిలో మహిళా పోలీసులు, వాలంటీర్లతో కలిసి ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. మీ ఇంట్లో మద్యం తాగే అలవాట్లు, ఈవ్ టీజింగ్ కేసులు, ఆస్తి తగాదాలు, సరిహద్దు వివాదాలు, పోలీసు కేసులు వంటి వివరాలు అన్నీ అడుగుతున్నారు. కుల మత రాజకీయపరమైన వివాదాల్లో తలదూర్చిన కేసుల గురించి కూడా అడుగుతున్నారు. సమాజంలో నేరమయ వాతావరణ స్థాయిని లెక్కించడానికి అంచనా వేయడానికి, ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇలాంటివి అడుగుతున్నారేమో అని వారు సర్ది చెప్పుకోవచ్చ. కానీ మీ ఇంట్లో ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అని కూడా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అడుగుతున్నారు. అయినా తమ తమ ఇళ్లలో అక్రమ సంబంధాలే ఉంటే గనుక.. ఆ సంగతి సర్వేల్లో ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కడానికి ఎవ్వరు బయటకు చెప్పుకుంటారు?
నా మొగుడికి ఫలానా మహిళతో అక్రమ సంబంధం ఉంది.. అని ఒక ఆకతాయి మహిళ, ఇంకో గౌరవప్రదమైన మహిళతో ముడిపెట్టి అబద్ధాలు చెప్పేస్తే వాటిని ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించేస్తారా? ఏ ఆకతాయి వెధవో.. తనకు సంబంధాలున్నాయని పదిమంది గృహిణుల పేర్లు చెప్పేస్తే అతని ఖాతాలో వారి పేర్లన్నీ రాసేసుకుంటారా? అనేది ప్రజలకు ఎదురవుతున్న సందేహం. ‘‘మీ ఇంట్లో వివాహేతర సంబంధాలున్నాయా? బహుళ లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారా? ఒకటి కంటె ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారా? వాటికి సంబంధించి పాత కేసులున్నాయా?’’ వంటి శాస్త్రోక్తమైన ప్రశ్నలతో గలీజు వివరాలను సేకరించడానికి ప్రభుత్వం పూనుకుంటోంది.
అయినా స్త్రీపురుషులు ఇద్దరూ ఇష్టపడితే వారి మధ్య లైంగిక సంబంధంలో తప్పులేదని సుప్రీం కోర్టు తేల్చేసిన తర్వాత.. అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం అనే పదాలకు అర్థం లేకుండాపోయింది. ఈ జగన్ సర్కారు ఊళ్లో ప్రజలందరి రంకు బాగోతాలన్నీ సేకరించి దాచుకుని.. ఆ వివరాలతో ఏం చేయాలనుకుంటన్నదో మాత్రం అర్థం కావడం లేదు. ఇద్దరు ముగ్గురు పెళ్లాలున్న వారికి జగనన్న కొత్తగా ఏదన్నా సంక్షేమ పథకం ప్రారంభిస్తాడో.. లేదా, ఒకటి కంటె ఎక్కువ పెళ్లాలుంటే వారిమీద అదనంగా పన్ను వేస్తాడో అని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.
జగన్.. రంకుబాగోతాల కతలు ఏం చేసుకుంటారు?
Thursday, November 14, 2024