వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా? ఈ అనుమానం ప్రజల్లో చాలాకాలం నుంచి ఉంది. రాష్ట్రప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నదని, తలకిందులుగా తపస్సు చేసినా సరే.. వచ్చే ఏడాదిలో ఎన్నికలు వచ్చే రోజు దాకా ఇదే స్థాయిలో సంక్షేమ పథకాలను, డబ్బులు పంచి పెట్టే పనులను కొనసాగించడం అసాధ్యం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అసలే జీతాలు ఏ నెలలోనూ సమయానికి ఇవ్వకుండా అప్రతిష్ట పాలవుతున్న ప్రభుత్వం, ఏ ఒక్క నెల అయినా సంక్షేమ పథకాలు ఆగితే.. సమాధి అయిపోతామనే భయం ప్రభుత్వంలో ఉండడం సహజం. అందుకే.. ఆ పరిస్థితి రాకుండా.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మరింత దిగజారకముందే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారనేది ఒక అంచనా.
అదే సమయంలో ముందస్తు ఆలోచనకు (ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే) రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. నారా లోకేష్ పాదయాత్ర అనేది అసలు 400 రోజులు పూర్తిగాజరగకుండా, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర అసలు మొదలే కాకుండా.. అంటే విపక్షాలు ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కాకుండా ఉండేలా.. ముందస్తు గంట మోగించాలనేది జగన్ వ్యూహం కావచ్చునని ఒక అభిప్రాయం. బడ్జెట్ సమావేశాల తర్వాత.. ఆ ముచ్చట ఉంటుందని కొందరు అంటున్నారు.
ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం మాకేం ఖర్మ, అయిదేళ్లు అధికారంలో ఉండమని ప్రజలు తీర్పు ఇచ్చారు, ఉంటాం.. అని చిలకపలుకులు వల్లిస్తుంటారు. కానీ.. తాజా పరిణామాలు గమనిస్తే ముందస్తు ఎన్నికలు తప్పవని అనిపిస్తోంది. జగన్ తాజాగా ఓ ప్రచార కార్యక్రమానికి ప్రణాళిక రచించారు. ‘జగనన్నే మన భవిష్యత్తు’ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికింద పార్టీ కీలక కార్యకర్తలు అనగా, 50 ఇళ్లకు ఇద్దరేసి వంతున ఇటీవలి కాలంలో నియమించిన పార్టీ గృహసారథులు, వార్డు కన్వీనర్లు ఇంటింటికీ వెళ్తారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి, ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా లభించిన లబ్ధి గురించి వారికి వివరిస్తారు. అలాగే.. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి వక్కాణిస్తారు.
నిజం చెప్పాలంటే.. కొన్ని నెలల కిందట ప్రారంభించి ఇప్పటికీ కొనసాగుతున్న గడపగడపకు కార్యక్రమ స్వరూపం కూడా ఇదే. సాక్షాత్తూ ఎమ్మెల్యేలే ఇంటింటికీ తిరిగి, మేం మీ ఇంటికి ఇంతింత లబ్ధి చేశాం అని ఏకరవు పెట్టారు. ఇప్పుడు గృహసారథుల ద్వారా అదేపనిని రిపీట్ చేయిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి రిపీటెడ్ ప్రచారాలతో జగన్ ఎందుకు ముందుకు సాగుతున్నారు.. ఖచ్చితంగా ఇది ముందస్తు ఎన్నికలకు సంకేతమే అని పలువురు భావిస్తున్నారు. ‘జగనన్నే మన భవిష్యత్తు’ అనే కార్యక్రమం పూర్తిగా మరి కొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నట్టుగా ధ్వనిస్తోందని అంచనా వేస్తున్నారు.
జగన్ ముందస్తు ఎన్నికలకు ఇదే సంకేతం!
Friday, December 27, 2024