వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలి.. డూడూ బసవన్నల్లాగా ఆడించాలి. కుదరకపోతే, తమకంటె పైస్థాయి వారి పరిధిలో వ్యవహారం ఉంటే.. వారి ఎదుట సాగిలపడాలి.. తమకు సానుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చక్రం తిప్పాలి. ఇదీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు. రుషికొండ విధ్వంసం విషయంలో కూడా వారు ఇలాంటి వక్రవ్యూహాలతోనే చెలరేగుతున్నారు. అయితే.. తాజాగా హైకోర్టు మాటలను గమనిస్తే.. రుషికొండ విషయంలో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయం కలుగుతోంది. రుషికొండ విధ్వంసంపై అధ్యయేనానికి కమిటీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశిస్తే.. ఆ ఏర్పాటు కుమ్మక్కు వ్యవహారంలాగా మారడంతో.. ఆగ్రహించిన కోర్టు తామే స్వయంగా కమిటీ ఏర్పాటుచేస్తామని పూనుకోవడం ఇందుకు నిదర్శనం. హైకోర్టు ఆధ్వర్యంలోనే నిష్పాక్షిక కమిటీ ఏర్పాటు అయితే.. ఏదో యుద్ధబంకర్ల నిర్మాణం జరుగుతున్నట్టుగా.. నరమానవుల సంచరాన్ని నిషేధించి, భయంకరమైన పోలీసు పహరాల మధ్య రుషికొండను శిథిలం చేసేసి జగన్ సర్కారు చేపడుతున్న నిర్మాణాల్లోని లోటుపాట్లు, అక్రమాలు, అరాచకాలు, నిబంధనల ఉల్లంఘన ఇలాంటివన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
విశాఖ సముద్ర తీరంలో నగరానికే తలమానికంగా ఉండే రుషికొండను ధ్వంసం చేసి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలు తొలినుంచి వివాదాస్పదంగానే ఉన్నాయి. టూరిజం గెస్ట్ హౌస్ ల ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు ప్రభుత్వం తొలినుంచి వాదిస్తోంది. అయితే.. నిర్మాణానికి రుషికొండపై ఏ మేరకు తవ్వకాలు జరపవచ్చునో.. ఆ పరిమితులకు మించి.. విచ్చలవిడిగా.. రుషికొండను మొత్తం తవ్వేసి విధ్వంసం చేసేసినట్టుగా అక్కడ జరుగుతున్న పనులు చూస్తే అర్థమవుతుంది.
ప్రభుత్వం మాత్రం రుషికొండ చుట్టూ విపరీతమైన పోలీసు పహరా ఏర్పాటుచేసి.. నరమానవులు అటువైపు రాకుండా.. ప్రత్యేకించి ప్రతిపక్షాల వారు వస్తే అరెస్టులు చేసేస్తూ రెచ్చిపోతోంది. రుషికొండలో ఏం జరుగుతోందో, ఏం నిర్మిస్తున్నారో ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు పడుతోంది. విపక్షాల ఆరోపణల ప్రకారం.. రుషికొండలో జగన్ సర్కారు అనుకుంటున్న రాజధానికోసం సచివాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయనే వాదన ఉంది. అయితే.. ఈ విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు.. రుషికొండ విధ్వంసంలో ఏమేరకు నిబంధనల అతిక్రమణ ఉన్నదో అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఆ కమిటీలో రాష్ట్రప్రభుత్వం నుంచే ముగ్గురు అధికారులు ఉండడంతో హైకోర్టు సీరియస్ అయింది. కేంద్రంతో తమకున్న సత్సంబంధాలను వాడుకుని.. రుషికొండపై కమిటీలో రాష్ట్ర అధికారులు వచ్చేలా వైసీపీ పావులు కదిపినట్టు ఆరోపణలున్నాయి. ఇలాంటి వైఖరిపై తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.. రాష్ట్రప్రభుత్వమే విధ్వంసం చేస్తోందని ఆరోపణలుండగా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ వేస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. కమిటీని తామే నియమిస్తామని కూడా సెలవిచ్చింది. హైకోర్టు స్వయంగా పూనుకుంటే.. రుషికొండ విధ్వంసానికి సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. జగన్ సర్కారుకు అప్పుడు మరోసారి కోర్టు ద్వారా భంగపాటు తప్పకపోవచ్చు. అయితే.. జగన్ సర్కారుకు చేదుగుళికలాంటి ఈ కోర్టు నిర్ణయం కూడా ఆయన బర్త్ డే రోజు కానుకగా రావడం విశేషం.
జగన్ బర్త్‌డే గిఫ్ట్3 : రుషికొండపై ఎదురుదెబ్బ తప్పదా?
Monday, December 23, 2024