ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ అట్టహాసంగా తన 50 వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. విద్యార్థులందరికీ ట్యాబ్ లు పంపిణీ చేసే, ఆకాశ్ కు భారీ మొత్తాలు చదివించుకునే చదువుల కార్యక్రమానికి ఆయన బర్త్ డే రోజునే ముహూర్తం పెట్టుకున్నారు. మరో వైపు ఆయన అభిమానులు, ఆశ్రితులు, వందిమాగధులు అందరూ కలిసి వందల కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ బర్త్ డే అట్టహాసం దద్దరిల్లింది. అయితే ఇదే రోజున రాష్ట్రం పరువుపోయే పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. పార్లమెంటు సాక్షిగా.. రాష్ట్రప్రభుత్వపు వైఫల్యాలను కేంద్రమంత్రి ఎత్తిచూపించడం విశేషం.
ఎడా పెడా రాష్ట్రంలో ఉచిత పథకాలు అమలవుతూ ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి పథకాల గురించిన చర్చలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘‘ఒక రాష్ట్రప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఉద్యోగులంతా నిరసనకు దిగుతున్నారు. ఆ ప్రభుత్వం ఉన్న నిధుల్ని దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలకు ఖర్చు చేయడమే ఇందుకు కారణం’’ అంటూ దెప్పిపొడవడం గమనార్హం. ‘‘రాయితీలు, ఉచితాలు సందర్భోచితంగా ఉండాలి. మీ బడ్జెట్ లో ఉచితపథకాలు పెడితే.. దానికి తగిన ఏర్పాట్లు మీవద్ద ఉండాలి. మీకు ఆదాయం ఉంటే ఇచ్చుకోవచ్చు. విద్య, ఆరోగ్యం, రైతు లకు ఇస్తే మంచిదే..’’ అంటూ నిర్మలా సీతారామన్ చెప్పిన హితవాక్యాలు.. ఆమె ప్రత్యేకంగా రాష్ట్రం పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. అచ్చంగా ఆంధ్రప్రదేశ్ ను ఆటాడుకోడానికి చెప్పిన మాటలే అని ఎవ్వరికైనా అర్థమవుతుంది.
జగన్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఉచిత పథకాల పేరుతో.. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేస్తున్నారు. ఈ పథకాలను ఎవ్వరు విమర్శించినా సరే.. ‘‘మీరు మంచిగా బతికితే చాలా..? పేదవాళ్లు మంచిగా బతకాలని మా ప్రభుత్వం కోరుకుంటే మీకు కన్ను కుడుతోందా?’’ అనే అసహ్యమైన వాదనలతో ఎదుటివారి మీద పైచేయిసాధించడానికి ప్రభుత్వంలోని వారంతా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రమంతా కులాలు, వృత్తుల వారీగా ఎంపిక చేసి.. ఉచితపథకాల పేరుతో నేరుగా వారి జేబుల్లోకి డబ్బులు పంపిణీ చేసే పథకాలు ఎక్కువైపోవడంతో.. రాష్ట్రప్రభుత్వం చేపట్టాల్సిన అసలైన అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. రోడ్లు రిపేరైతే పట్టించుకునే దిక్కులేదు. ఎక్కడైనా రిపేర్లు, నిర్మాణ పనులు జరిగితే.. ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించే దిక్కులేదు. ఒకసారి ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు మళ్లీ మరోసారి ప్రభుత్వ పనుల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తం అభివృద్ధి పడకేయగా.. సంక్షేమం పరుగులు పెడుతోందని ప్రభుత్వం ఉచితపథకాల గురించి చాటుకుంటోంది. ఈ పథకాల దెబ్బకు.. అసలు ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని దుస్థితి దాపురిస్తుండగా.. అదే విషయాన్ని నిర్మలా సీతారామన్ జగన్ బర్త్ డే రోజునే పార్లమెంటులో ప్రస్తావించి పరువు తీయడం విశేషం.
జగన్ బర్త్‌డే గిఫ్ట్2 : పార్లమెంటు సాక్షిగా పరువుపాయె
Tuesday, November 12, 2024