డిఎల్ రవీంద్రరెడ్డి అంటే.. కడప జిల్లాలో ప్రభావశీలమైన నాయకుల్లో ఒకరు. ఒకప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సమఉజ్జీగా, సహచరుడిగా కాంగ్రెసు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతానికి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ, సొంత పార్టీకి ఈసారి ఎన్నికల్లో పరాజయం తప్పదని జోస్యం చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద ఒక స్థాయిలో నిప్పులు చెరిగిన డీఎల్ రవీంద్ర రెడ్డి.. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నందుకు తనకే అసహ్యంగా ఉన్నదని వ్యాఖ్యానించడం విశేషం. జగన్ పుట్టిన రోజునే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్లో మాత్రమే సీట్లు దక్కుతాయని శాపాలు పెట్టడం గమనార్హం.
డీఎల్ రవీంద్రరెడ్డి కడప జిల్లాలో సీనియర్ నాయకుల్లో ఒకరు. ఒకప్పట్లో వైఎస్ ఆధిపత్యానికి ఎదురునిలిచిన నాయకుడు కూడా. కానీ, తర్వాతి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయిన నేపథ్యంలో.. వైఎస్ శత్రువులుగా చెలామణీ అయినప్పటికీ ఆయన కొడుకు స్థాపించిన వైసీపీలో చేరారు. ఇటీవలి కాలంలో రాజకీయంగా సైలెంట్ గా ఉన్న డీఎల్ రవీంద్రరెడ్డి.. కడపలో జగన్ బర్త్ డే రోజున ప్రెస్ మీట్ పెట్టి మరీ నిప్పులు చెరగడం, నిందలు వేయడం విశేషం.
జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాటినుంచి అవినీతికి పాల్పడుతున్నారని.. వైఎస్ కొడుకు ఈ స్థాయిలో అవినీతిపరుడు అని ఊహించలేదని డీఎల్ అంటున్నారు. ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం అవుతుందని శాపం పెడుతున్న ఆయన, రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప మరెవ్వరూ కాపాడలేరని అనడం విశేషం. పవన్ కల్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేం అంటూనే.. వారిద్దరూ కలిసి పోటీచేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని సెలవిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గుర్తింపు ఉన్న పార్టీ తరఫునే బరిలోకి దిగుతానని అంటున్న డీఎల్.. ఈ రెండు పార్టీల్లో ఒకరి తరఫున దిగవచ్చునని పలువురు ఊహిస్తున్నారు.
డీఎల్ రవీంద్ర రెడ్డికి తొలినుంచి కూడా.. నిర్భయంగా తన గళం వినిపించే నాయకుడిగా పేరుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మీద ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందే.. తీవ్రమైన విమర్శలు చేసి అప్పట్లో డీఎల్ సంచలనం సృష్టించారు. తర్వాతి రాజకీయ సమీకరణాల్లో డీఎల్ ను జగన్ తన పార్టీలో చేర్చుకున్నారు. నామ్ కే వాస్తే గా పార్టీలో చేర్చుకున్నారే తప్ప ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. వైఎస్ సమకాలీనులు, సహచరులు, మిత్రులు చాలా మందిని జగన్ తన పార్టీలో చేర్చుకుని పక్కన పెట్టినట్టే.. డీఎల్ ను కూడా పక్కన పెట్టారు. కొణతల రామకృష్ణ లాంటి వైఎస్ ఆప్తులు, మైసూరారెడ్డి లాంటి ఆత్మీయ శత్రువులు అందరూ జగన్ తో పొసగక బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. డీఎల్ టెక్నికల్ గా ఇంకా వైసీపీ పార్టీలో ఉన్నారు. కానీ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మీదనే పోరాటం చేయబోతున్నారు.
జగన్ బర్త్‌డే గిఫ్ట్1 : తండ్రి సహచరుడి శాపాలు!
Monday, December 23, 2024