ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది ముఖ్యమంత్రుల లాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న నిరసనలను కూడా సహించలేరు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను వాడుకుని నిరసనోద్యమాలను ఎప్పటికప్పుడు అణిచివేయడానికి జగన్ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఆదేశాలను శిరసావహిస్తూ పోలీసు యంత్రాంగం నడుచుకుంటూ ఉంటుంది. అయితే వైయస్ జగన్ మరో అడుగు ముందుకు వేసి, తన మాటను అనుసరిస్తూ అడుగులకు మడుగులొత్తే అలవాటు లేని పోలీస్ అధికారులు అందరినీ అడ్డగోలుగా బదిలీలు చేసేసారు. అచ్చమైన వీర విధేయులను మాత్రమే కీలక పోలీసు పదవులలో కొనసాగిస్తున్నారు. ఏ చిన్న ప్రజా నిరసన వ్యక్తమైనా, వారి ద్వారా, దానిని తక్షణం తొక్కేస్తున్నారు. ప్రభువును మించిన ప్రభు భక్తి ప్రదర్శించే అలవాటు ఉండే పోలీసులు జగన్ ప్రీత్యర్థం, ఇలాంటి అణిచివేత పర్వాలలో ఓవరాక్షన్ చేస్తుండడం కూడా జరుగుతుంది. తాజాగా అలాంటి పోలీసుల చర్య వలన జగన్ ప్రత్యర్థులకు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. రాబోయే ఏడాది కాలం పాటు విపక్ష పార్టీలు ఈ ఒక్క ఐడియా తో జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం మెండుగా ఉంది.
ఇంతకు ఏం జరిగిందంటే.. తన నియోజకవర్గ పరిధిలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ సంతకాలు కూడా చేసిన తర్వాత నిధులు రావడం లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక నిరసనకు ఉపక్రమించారు. అధికారులపై ఒత్తిడి తేవడానికి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ నిరసనకు అనుమతులు లేవంటూ పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేసేసి నిరసనను అడ్డుకున్నారు. కోటంరెడ్డి తన నియోజకవర్గంలో పనుల కోసం నిరసనలు చేయదలుచుకున్నప్పుడు పోలీసులు అడ్డగోలుగా వాటిని అణిచివేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఈ అనుభవాలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఒక కొత్త ఆలోచన ఇచ్చాయి. ఇకమీదట తన నియోజకవర్గంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నప్పటికీ వాటిని ముందుగా ప్రకటించబోనని, పోలీసు అనుమతులు అడగబోనని.. గెరిల్లా తరహాలో ఉద్యమాలు చేపడతానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ప్రజా ఉద్యమం చిన్నదో పెద్దదో జరిగినప్పుడు కచ్చితంగా ప్రభుత్వానికి పరువు నష్టమే. ఆమెకు డామేజ్ చేయడానికి కోటంరెడ్డి ఐడియా ఫలించే లాగానే ఉంది.
ప్రభుత్వ అణచివేత చర్యలను తెలుగుదేశం, జనసేన పార్టీలు రెండూ ఎదుర్కొంటూనే ఉన్నాయి. బిజెపి వారి పట్ల కూడా పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో నెల్లూరు సంఘటనలో అంతా గమనించారు. ఈ నేపథ్యంలో గెరిల్లా పోరాటం తరహా నిరసన కార్యక్రమాలు అనే ఐడియా గొప్పగా ఉంది. ఈ విపక్ష పార్టీలకు చెందిన వారంతా.. తాము నిరసన చేయదలచుకున్న అంశాల గురించి గెరిల్లా తరహాలోనే హఠాత్ ఉద్యమాలను, నిరసనలను చేయడం మొదలుపెడితే పోలీసులు వారిని అడ్డుకోవడం అసాధ్యం. కొన్ని గంటలపాటు దీక్షలైతే దివ్యంగా సాగుతాయి. అందుకే.. నెల్లూరు పోలీసుల ఓవరాక్షన్ మొత్తం విపక్షాలు అందరికీ గొప్ప ఐడియాను అందించినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.