వైఎస్ రాజశేఖర రెడ్డికి, కెవిపి రామచంద్రరావుకు ఎంతటి ఆత్మీయ అనుబంధం ఉన్నదో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేవీపీ రామచంద్రరావు ప్రభుత్వంలో అన్నీ తానే అయి వ్యవహరించారు. తర్వాతి కాలంలో ఎంపీ కూడా అయ్యారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రాధాన్యం కొంత అలాగే ఉండిపోయింది. ఆయన ఆ పార్టీని వీడి బయటకు రాలేదు.
వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సందర్భాలలో.. కెవిపితో అనుబంధం గురించి ఆయన తన ఆత్మ అని చెప్పుకున్నారు. వారి కుటుంబాల మధ్య కూడా అంతే గాఢమైన అనుబంధం ఉండేది. అయితే వైఎస్ మరణానంతరం పరిస్థితులు మొత్తం మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తర్వాత.. కేవీపీ రామచంద్రారావు దానికి దూరంగానే, కాంగ్రెసులోనే ఉండిపోయారు. ఆ పార్టీలోకి వచ్చిన వైఎస్ సన్నిహితులు అందరూ కూడా జగన్ తో పొసగక నెమ్మదిగా బయటకు వెళ్లిపోయారు. కానీ.. జగన్ తీరు మీద కెవిపి ఇప్పటిదాకా ప్రతికూలంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ఆయన దాదాపుగా మొదటిసారిగా జగన్ మీద గళమెత్తారు. పోలవరం పూర్తిచేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అంటున్నారు.
‘హాత్ సే హాత్ జోడో’లో భాగంగా ఏపీసీసీ విజయవాడలో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కెవిపి కూడా పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరం ఉన్నదని ఆయన పిలుపు ఇచ్చారు. 4 లక్షల మంది నిర్వాసితులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని ఆయన అంటున్నారు.
పీసీసీ సారధిగా గిడుగు రుద్రరాజు నియమితులైన తర్వాత.. పార్టీని కాస్త యాక్టివ్ గా ముందుకు తీసుకువెళ్లడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎటూ రాహుల్ పాదయాత్రకు కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాలు వారికి కలిసి వచ్చాయి. చాన్నాళ్లుగా సైలెంట్ గా ఉండిపోయిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ గిడుగు రుద్రరాజు తిరిగి సమీకరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే.. సాధారణంగా లో ప్రొఫైల్ లో ఉండే నేత కెవిపి రామచంద్రరావు కూడా ఈ సభకు వచ్చారు. అయితే ఆయన వైఎస్సార్ తనయుడి మీద పార్టీ తరఫున నిలదీసే స్వరం వినిపించడం ఆశ్చర్యకరం. సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత.. కెవిపితో జగన్ ఎన్నడో సత్సంబంధాలు కొనసాగించలేదు. అయినంత మాత్రాన ఆయన ఎన్నడూ జగన్ గురించి బహిరంగంగా మాట్లాడలేదు. పోలవరం నిర్వాసితుల విషయంలోనే తొలిసారిగా జగన్ వైఖరిని విమర్శించడం ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది.