జగన్ పట్ల ప్రజావ్యతిరేకతకు ప్రబల సంకేతాలివి!

Wednesday, January 22, 2025

ఒక పార్టీ నుంచి నేతలు జారుకుంటూ ఉన్నారంటే దాని అర్థం.. ఆ పార్టీ భవిష్యత్తు మీద వారికి అనుమానాలు పుడుతున్నాయని! కానీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి- మనం చేపడుతున్న సంక్షేమ పథకాలే మనల్ని గెలిపిస్తాయని వాటి గురించి సక్రమంగా ప్రజల్లో ప్రచారం చేస్తే చాలునని పదే పదే చెబుతుంటారు. ఒక్కో ఇంటికి ఎంత మేర సంక్షేమ లబ్ధి అందించామో తెలిపే కరపత్రాలను ముద్రించి,  ఎమ్మెల్యేల ద్వారా వాటిని ఇంటింటికీ చేరిస్తే చాలు ఆ కుటుంబంలోని ఓట్లు మొత్తం గంపగుత్తగా దఖలు పడిపోయినట్లే అనే నమ్మకంతో ప్రవర్తిస్తుంటారు. ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకుండా వారిని పూచికపుల్లల్లాగా తమ సంక్షేమ కరపత్రాలకు కొరియర్ బాయ్ లాగా వాడుతుంటారు. ఇంకా లోతుగా వెళ్లి చెప్పాలంటే ఇంత లావు సంక్షేమం చేపడుతున్న నేపథ్యంలో తాను ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా సరే గెలిచి తీరుతారనే నమ్మకంతో ఆయన విర్రవీగుతుంటారు . అయితే ఇదంతా నిజమేనా? జగన్మోహన్ రెడ్డి ఊహిస్తున్న స్థాయిలో ఆయన చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో గౌరవం, భక్తి ప్రపత్తులు వెల్లువెత్తుతున్నాయా అనేది తాజాగా తలెత్తుతున్న సందేహం. కేవలం ప్రజలకు డబ్బు పంచి పెడుతూ అదే సంక్షేమంగా, అదే అభివృద్ధిగా సరికొత్త నిర్వచనాలు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి వాటికి ప్రతిఫలంగా మళ్ళీ భారీ మెజారిటీలో సీట్లను దక్కించుకోవడం అంత సులువు కాదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతుంది.

ఎందుకంటే ఆయన సొంత పార్టీకి చెందిన పలువురు నాయకుల్లో కూడా ఈ సంక్షేమ పథకాల పట్ల ప్రజా స్పందన పై పూర్తిస్థాయి నమ్మకం లేదు. ముఖ్యమంత్రి ఎదుట నోరు విప్పి మాట్లాడడానికి వారు జంకుతుండవచ్చు గాని.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ఆందోళన వారిని వెన్నాడుతూనే ఉంది. ఈ ప్రజా వ్యతిరేకత ఎటుపోయి ఎటు వస్తుందో అనే భయం కూడా ఉంది. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది గుబులు గుబులు గానే కాలం గడుపుతున్నారంటే పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళందరూ నెమ్మదిగా పక్కదారులు వెతుక్కుంటున్న వాతావరణం గమనిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రమాదఘంటికలు మోగుతున్నట్లే అని మనకు తెలిసిపోతుంది.

నెల్లూరు జిల్లాలో తాజా పరిణామాల విషయానికి వస్తే అక్కడ పార్టీకి మొహం చాటేసి, పార్టీని కాదనుకున్న సొంత ఎమ్మెల్యేలు ఆషామాషి వ్యక్తులేమీ కాదు. నాయకులుగా అపారమైన సీనియారిటీని గడిచినవారే. ప్రజలతో మమేకమైన వారే.  ఒకవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరొకవైపు ఆనం రామనారాయణ రెడ్డి, వారి స్థాయిలో స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఇలా నాయకులు ఒక్కరొక్కరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదనుకుంటున్న నిర్ణయాల సంకేతం ఏమిటి?

పడవకు రంధ్రం పడి మునిగిపోయే ప్రమాదం ఉందని అర్థం అయినప్పుడు తెలివైన వాళ్ళు ఒక్కరొక్కరుగా ముందే తాము జాగ్రత్త పడతారు. ఇప్పుడు రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన నెల్లూరు జిల్లాలో కూడా వైసిపి ఎమ్మెల్యేలు చేస్తున్నది అదే అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవాలనుకుంటున్న సంకేతాలు ఆ పార్టీ మునిగిపోబోతున్నది అనే అర్ధాన్ని తెలియజేస్తాయి. ప్రజలు ఇలాంటి పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. సరైన సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. క్షేత్రస్థాయిలో ఉండే నాయకులు ప్రజా వ్యతిరేకతను గుర్తించి జాగ్రత్త పడుతున్న నేపథ్యంలో అలాంటి పేజా ప్రజా వ్యతిరేకత పట్ల అవగాహన లేకుండా తనను తాను మోసపుచ్చుకుంటూ ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డికి భంగపాటు తప్పదు. ఆ నాయకుల మీద నిందలు వేసి వారు పార్టీకి ద్రోహం చేస్తున్నారని మాటలు అనేసినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. నిజానికి నెల్లూరు జిల్లాలో ముగ్గురు సిటింగ్ ఎమ్మెల్యేలు చేజారిపోతున్న పరిణామం కనిపిస్తుంది గాని, రాష్ట్రంలో ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఇదే వాతావరణం ఉంది. కొందరిని పార్టీ వదిలించుకోవాలని అనుకుంటూ ఉంటే మరికొందరు పార్టీని వదిలి పోవాలని భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles