అమరావతిలో జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసేశారు. దాదాపు యాభైవేల మందికి సెంటుభూమి ఇళ్లపట్టాలు ఇవ్వడం అనేది కార్యక్రమం. కానీ.. కార్యక్రమం, సభ పెద్దగా సఫలం కాలేదు. వచ్చిన వాళ్లు నానా ఇబ్బందులు పడినట్టుగా, మధ్యలోనే తిరిగివెళ్లిపోయినట్టుగా కూడా పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటిని పట్టించుకోకపోయినప్పటికీ.. పేదలకు పట్టాలు ఇవ్వడం అనేది కేవలం ఒక ప్రహసనంగా మారిందనే విశ్లేషణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఇక్కడ పట్టాలు పంచే వ్యవహారంపై కోర్టులో ఇంకా కేసు నడుస్తోంది. ఒకవేళ పట్టాలు ఇచ్చేసినప్పటికీ.. కోర్టు చెప్పే తుది తీర్పునకు లోబడి మాత్రమే ఆ పట్టాలు చెల్లుబాటు అవుతాయని కోర్టు ఆల్రెడీ హెచ్చరించింది. అంటే పట్టాలు పొందిన తర్వాత, కోర్టు తన తుదితీర్పులో ఆర్ 5 జోన్ పేరిట సెంటు స్థలాల పంపిణీ అనేదే చెల్లదని అంటే గనుక, అక్కడి ఈ పట్టా కాగితాలు చిత్తు కాగితాలుగా కూడా పనికిరావు.
ఇండైరక్టుగా ఆ విషయాన్ని పేదలకు ఇచ్చిన పట్టాల మీదనే ముద్రించి మరీ హెచ్చరించింది ప్రభుత్వం.
1.హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లలో ఇవ్వాల్సిన ఆర్డర్ మరియు నిర్ణయానికి లోబడి పట్టా జారీ చేయబడుతోంది.
- తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినట్టయితే మంజూరుదారుడు ఏదైనా ప్రత్యేక ఈక్విటీని వాదించడానికి అర్హత కలిగి ఉండడు.
అనే రెండు నిబంధనలను ఒక స్టాంపు రూపంలో అదే పట్టాల మీద ప్రభుత్వం తహశీల్దారు సంతకంతో సహా ముద్రించి వారికి అందజేసింది.
అంటే ఏమిటన్నమాట. జగనన్న ఏదో తాను చేసేశానని, పంచేశానని చెప్పుకోడానికి జనానికి అక్కడ పట్టాలు ఇచ్చారే తప్ప.. ఆ జాగాల మీద వారికి ఇంకా హక్కు దఖలుపడడం లేదన్నమాట. కోర్టు తుదితీర్పు ఎప్పుడు వస్తే అప్పుడు వారికి హక్కులు వస్తాయి. కోర్టు తీర్పు వచ్చే దాకా పట్టా కాగితం చేతిలో పెట్టుకుని వారు ఎదురుచూస్తూ ఉండాలి. ఆ బీడు భూములను చూసుకుంటూ బతకాలి. ఈ త్రిశంకు స్వర్గంలో ఉండే పట్టాలను ఇవ్వడానికి జగన్ ఇంత హడావుడి చేయడం ఎందుకు? అనే వాదన వినిపిస్తోంది. కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగలేకపోవడం అనేది కేవలం జగన్ తొందరపాటు అని కూడా పలువురు అంటున్నారు.