భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఒక్కశాతం ఓటు బ్యాంకు. కానీ మాటలు చూస్తే కోటలు దాటుతుంటాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. తమ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అనే రీతిలో వాళ్లు ఎగస్ట్రాలు చెబుతుంటారు. అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జగన్ ను గెలిపించడానికి తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలని డిసైడ్ అయినట్టుంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మీద పదివేల చార్జిషీట్లు రూపొందిస్తామని అంటున్నారు.
ఇలాంటి అతిశయమైన డైలాగులు చెబితేనే ఎవరికైనా అనుమానం కలుగుతుంది. అప్పుడెప్పుడో.. నరేంద్రమోడీ విశాఖకు వచ్చినప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిమీద చార్జిషీట్ తయారుచేయాలని పార్టీ శ్రేణులకు మార్గదర్శనంచేశారు. అప్పటినుంచి రాష్ట్ర నాయకుల్లో దాని గురించి పట్టించుకున్న వారు లేరు. ప్రధాని సూచనకు అతీగతీ లేదు. ఇన్నాళ్లు ఏం చేస్తున్నారో తెలియదు. తీరా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలుగుదేశానికి, వైసీపీకి సమానదూరం పాటించాలనే కీలక నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు వారికి మూడ్ వచ్చినట్టుంది. చిత్తశుద్ధితో ప్రభుత్వాన్ని ఎండగట్టదలచుకుంటే నిజాయితీగా ఒక్క చార్జిషీట్ తయారుచేసినా సరిపోతుంది. కాకపోతే.. ఏదో పదివేల చార్జిషీట్లు చేయడం అంటే.. మరింత గట్టిగా ప్రభుత్వం మీద పోరాడినట్టుగా బిల్డప్ కోసం తప్ప ఈ నెంబరు ఎందుకూ పనికిరాదు.
అయితే బిజెపి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో సింగిల్ గా ప్రజల్లోకి వెళ్లడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు వీలైనంత ఎక్కువగా చీల్చాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అసలు చీలనివ్వకుండా చూడడం ద్వారా.. జగన్ సర్కారును ఓడించాలని వారి భాగస్వామి పవన్ పట్టుదలగా ఉన్నారు. అయితే బిజెపి మాత్రం.. వ్యతిరేక ఓటును చీల్చడమే తమ లక్ష్యం అన్నట్టుగా చెలరేగుతోంది. రాష్ట్ర బిజెపి నాయకుల్లో పలువురు జగన్ సర్కారుతో కుమ్మక్కు అయి పనిచేస్తున్నారని చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు ఉన్నాయి. బిజెపి అంతర్గ తసమావేశాల్లో కూడా ఈ మేరకు పలుమార్లు చర్చ జరిగింది. సాక్షాత్తూ అధ్యక్షుడు సోము వీర్రాజు మీదనే అలాంటి ఆరోపణలున్నాయి. మొత్తానికి ఇప్పుడు నిజాయితీతో ఒక చార్జ్ షీట్ సరిపోయేదానికి, పదివేల నెంబర్ మాట్లాడుతున్న నాయకుల మాటలు ఆ గుసగుసలకు ఊతమిస్తున్నాయి.
జగన్ ను గెలిపించడానికి పూనుకున్న బిజెపి!
Sunday, November 17, 2024