అధికారాన్ని అడ్డు పెట్టుకుని విధ్వంసం సాగించడం అనేది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేటెంట్ వ్యవహారంగా ముద్రపడింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులు బండి సంజయ్ , రేవంత్ర రెడ్డి లాంటి వాళ్లు.. ఈ విధ్వంసక ఆలోచనలను ఏపీ సీఎం జగన్ నుంచి నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి- తాను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అన్నట్టుగా.. అధికారంలోకి రాగానే తన మార్కు విధ్వంసాన్ని ప్రారంభించారు. కానీ.. ఈ తెలంగాణ విపక్ష నాయకులు అధికారంలోకి రాకముందే .. విద్వంసక రాగాలాపన ప్రారంభిస్తున్నారు. అది కూలుస్తాం ఇది పేలుస్తాం అంటున్నారు.
ఆవేశ పూరిత ప్రసంగాలు చేయడంలో అందెవేసిన రేవంత్ రెడ్డి తమ అధికారంతో సంబంధం లేకుండా.. నక్సల్స్ ప్రగతి భవన్ ను బాంబులు పెట్టి పేల్చేయాలని అభిలషించడంతో అసలు గొడవ ప్రారంభం అయింది. ఆయన సొంత పార్టీ నాయకులే అలాంటి మాట అని ఉండాల్సింది కాదంటూ హితవు చెప్పారు. భారాస నాయకులైతే ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు కూడా ఇలాంటి మాటలను అసహ్యించుకున్నారు. నోరుజారి అన్న మాటలు బెడిసి కొట్టాయని రేవంత్ త్వరగానే గ్రహించారు. తర్వాత రేవంత్ కూడా తన మాటను దిద్దుకున్నాడు. ప్రగతి భవన్ ను ప్రజాదర్బార్ గా మార్చేయాలని వివాదం సద్దుమణిగేలా చేశాడు.
రేవంత్ ఎపిసోడ్ తర్వాత కూడా బండి సంజయ్ కు బుద్ధి మారినట్లు లేదు. ఆయన ఏకంగా ఇప్పుడే నిర్మాణం పూర్తి చేసుకుంటున్న సచివాలయ భవనం గుమ్మటాలను కూలగొడతాం అంటున్నారు. ఆ గుమ్మటాలు చూడగానే ఆయనకు ఇస్లామిక్ నిర్మాణ శైలి గుర్తుకొస్తున్నట్టుగా ఉంది. పాపం అదే నిజమైతే గనుక.. బండి సంజయ్ అవగాహన రాహిత్యానికి జాలిపడాల్సిందే.
అసలు ఆయా పార్టీలు అధికారంలోకి రావడం అంటూ జరిగితే ఎంతో కీలకస్థానాల్లో ఉండగల ఈ నాయకులకు ఇలాంటి విధ్వంసక ఆలోచనలకు ప్రేరణ, స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డేనా అనే చర్చ జరుగుతోంది ప్రజల్లో! జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వపు సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను పూర్తిగా కూలగొట్టించారు. చంద్రబాబునాయుడు నివాసానికి సమీపంలో ఉండే ఈ నిర్మాణాన్ని పూర్తిగా కూలగొట్టించి.. కనీసం అక్కడినుంచి శిథిలాలను కూడా తొలగించకుండా అలాగే ఉంచేశారు.
ఒకసారి ప్రభుత్వం డబ్బుతో నిర్మించినది ఏదైనా సరే అదే ప్రజల ఆస్తి అవుతుంది. జాతీయ సొత్తు అవుతుంది. తమ తమ రాగద్వేషాలను బట్టి వాటిని కూలగొట్టించడం అనేది నాయకుల్లో ఉండే సంకుచిత బుద్ధులకు తార్కాణం. ఇలాంటి కురచ బుద్ధుల నాయకులు ప్రజలకు ఏం మేలు చేయగలరు? ఎలాంటి సామాజిక ప్రయోజనాలకోసం పనిచేయగలరు.. అనేది ప్రశ్నార్థకం.
జగన్ నుంచి బండి, రేవంత్ స్ఫూర్తి పొందారా?
Monday, December 23, 2024