తిరుమల తిరుపతి దేవస్థానల ధర్మకర్తల మండలి సభ్యత్వం అంటే పైరవీకారుల అడ్డా కాదు. వేంకటేశ్వరస్వామి మీద అనన్యమైన భక్తితో, ఆయన సేవలో ఆ రూపంలో భక్తుల సేవలో తరించాలనుకునే వారికి చోటు ఉండాల్సిన భూమిక. కానీ ధర్మకర్తల మండలిలో నియామకాలు అనేవి.. రాజకీయ నిర్వాసితులకు పునరావాసం కల్పించే వ్యవహారంగా మారిపోయిన తర్వాత.. పైరవీకార్లకు దళార్లకు అడ్డాగా మారిపోయిన తర్వాత.. అనేక రకాలుగా బోర్డు గౌరవం భ్రష్టు పట్టిపోయింది. తాజాగా టీటీడీ బోర్డు పరువు మరోసారి పోయింది. ఎలాంటి వ్యక్తులను ఈ గౌరవప్రదమైన పోస్టులలో నియమిస్తూన్నారో ప్రజలకు అర్థమవుతోంది. జగన్ ఎలాంటి వారిని తీసుకువచ్చి దేవుడి పాలకులుగా నియమిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు.
సాహితీ ఇన్‌ఫ్రా టెక్ వెంచర్స్ పేరుతో దాదాపు 900 కోట్లరూపాయల సొమ్ము అక్రమంగా వసూళ్లు చేసి.. ఎగవేసిన, మోసాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బూదాటి లక్ష్మీనారాయణ. సాహితీ గ్రూపునకు ఆయన ఎండీ. అలాంటి వ్యక్తి టీటీడీ ధర్మకర్తల మండలిలో నిన్నటిదాకా సభ్యుడు. తన మోసాలు పండి పోలీసులు తనను అరెస్టు చేసిన తర్వాత ఆయన తన బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అది ఆమోదం కూడా పొందుతుంది.
అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే.. బూదాటి లక్ష్మీనారాయణ ప్రజలను ఎలా మోసం చేశాడు.. ఎన్ని వందల కోట్లు కాజేశాడు అనేది కాదు. అలాంటి మోసగాడికి ఎంతో పవిత్రమైన టీటీడీ బోర్డు సభ్యత్వం పదవిని జగన్ ఎలా ఇచ్చారు? అనేదే! ఆయనేమీ ఘనమైన ఆధ్యాత్మిక నేపథ్యంగానీ, రాజకీయ చరిత్ర గానీ ఉన్న వ్యక్తి కూడా కాదు. కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ ముసుగులో వందల కోట్ల రూపాయలు ప్రజలనుంచి కాజేసిన వ్యక్తి. అంటే.. వందల కోట్ల రూపాయలతో పైరవీలు చేసుకుంటే టీటీడీ బోర్డు సభ్యత్వం పదవులను అమ్మేశారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. టీటీడీ బోర్డు సభ్యత్వ పదవులను కూడా వందల కోట్లతో కొనుక్కునే ప్రబుద్ధులు వెంకటేశ్వరుని సేవలోకి వచ్చాక.. భక్తులకోసం పనిచేస్తారా? లేదా, తమ పెట్టుబడిని తిరిగి ఆర్జించుకోవడానికి బడాబాబుల కోసం పైరవీలు చేస్తూ బతుకుతారా? ఇలాంటి వారు సభ్యులు కాబట్టే కదా.. బోర్డు సభ్యుల సిఫారసు ఉత్తరాలను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు.. అని ప్రజలు అంటున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి.. భారీ ఆర్థికకుంభకోణాలకు పేరుమోసిన శేఖర్ రెడ్డికి కూడా టీటీడీ బోర్డు పదవి కట్టబెట్టారు. నోట్ల రద్దు తర్వాత.. రిజర్వు బ్యాంకు ప్రింట్ చేసిన కొత్త 2000 నోట్లను 34 కోట్లు బ్యాంకుకు వెళ్లకుండానే తన ఇంటికి తెప్పించుకున్న ఘనతతో ఆయన వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు జగన్ నిర్వాకంతో టీటీడీ బోర్డు పదవి దక్కించుకున్న బూదాటి లక్ష్మీనారాయణ వందల కోట్ల మోసాలతో సీఎం పరువు తీశారు. గతంలో కూడా.. సినీ నటుడు పృథ్వీరాజ్ కు ఎస్వీబీసీ చానెల్ సారథ్యం కట్టబెట్టిన జగన్, ఆయన శృంగార కార్యకలాపాల వల్ల తన పరువు తానే తీసుకున్నారు. జగన్ తన చేతిలో అధికారం ఉన్నది కదాని.. ఎలాంటి అథముల్ని తీసుకువెళ్లి దేవుడి సేవలో నియమిస్తున్నారో.. క్రాస్ చెక్ చేసుకోవాలని.. తన అలవాటు మార్చుకోవాలని జనం కోరుకుంటున్నారు.
జగన్ నిర్వాకం.. వెంకన్న సేవలో మోసగాళ్లు!
Friday, November 22, 2024