అమరావతి రాజధానిని అస్తిత్వం అంటూ లేకుండా సర్వనాశనం చేసేయాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి దుర్బుద్ధి. అందుకు సంబంధించి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయవచ్చో ఆయన అన్నీ చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని మాత్రమే గుర్తించి, అక్కడి నిర్మాణాలను ఆరునెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ఏమాత్రం పట్టించుకోకుండా సుప్రీంలో దావా వేసి మిన్నకుండిపోయారు. అదే సమయంలో అమరావతి నగర మాస్టర్ ప్లాన్ ను దెబ్బతీసేలా.. ఆర్ 5 జోన్ అంటూ వివాదాస్పద జోన్ ను ప్రకటించి.. యాభై వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి ముందుకు వచ్చారు. ఈ వ్యవహారం కోర్టులో పడగా.. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండేలా.. పేదలకు మాత్రం పట్టాలు పంపిణీ చేసేశారు.
పేదలకు జగన్ సర్కారు పట్టాలు ఇచ్చింది గానీ.. ఆ స్థలాలు వారికే ఖచ్చితంగా చెందినట్లు కాదు. సుప్రీం కోర్టు తుదితీర్పుకు లోబడి యాజమాన్య హక్కులు ప్రాప్తిస్తాయని వారికి ఇచ్చిన పట్టాల్లోనే స్పష్టంగా పేర్కొన్నారు. అయితే స్థలంపై హక్కులు పూర్తిగా రానేలేదుగానీ.. ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేసే కొత్త డ్రామాకు జగన్ సర్కారు తెరలేపింది. అమరావతి నగర మాస్టర్ ప్లాన్ సర్వనాశనం అయ్యేలా ఈ ఇళ్ల నిర్మాణానికి జగన్ సంకల్పించడమే తడవుగా కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేయడం ఇప్పుడు ఇంకా వివాదాస్పదం అవుతోంది.
అమరావతి మాత్రమే రాజధాని అని తాము గుర్తిస్తున్నామని, అమరావతి రైతులకు మద్దతుగా ఉంటామని, తాము అధికారంలోకి వస్తే అమరావతిని మాత్రమే రాజధానిగా అభివృద్ధి చేస్తామని భారతీయ జనతా పార్టీ పదేపదే ప్రకటిస్తూ ఉంటుంది. అయితే.. ఇప్పుడు అమరావతి స్ఫూర్తిని మంటగలిపేలా ఆర్ 5 జోన్ లో రాజధానేతర ఇళ్ల నిర్మాణానికి జగన్ సర్కారు ప్రతిపాదనలు పంపితే.. ఆగమేఘాల మీద వాటికి అనుమతులు కూడా ఇచ్చేసింది. సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఈ అనుమతులు మంజూరయ్యాయి.
ఇవి పట్టణ ప్రాతిపదికగా కేంద్రం అనుమతులు రావడంతో.. కేంద్రం తరఫున ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలు, రాష్ట్ర తరఫున 30 వేలు వస్తాయి. కేవలం కేంద్రం ఇచ్చే సొమ్మును లెక్కవేసినప్పటికీ.. 47 వేల ఇళ్లకు 705 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంత డబ్బు ఖర్చు చేసిన తర్వాత.. హైకోర్టు తీర్పు.. రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తే గనుక.. ఆ సొమ్ముమొత్తం వృథా అయినట్టే. మొత్తం 705 కోట్ల ప్రజాధనం వృథా అవుతుంది. ఒకవైపు జగన్ సర్కారు అరాచకత్వాన్ని అడ్డుకుంటాం అని అంటూనే కేంద్ర సర్కారు.. ఆయన పంపిన అరాచకమైన ప్రతిపాదనలకు వెంటనే జైకొట్టడం అనేది ఘోరంగా ఉన్నదని రాజధాని రైతులు విమర్శిస్తున్నారు.