ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. వ్యవహార భాషలోనే మనందరమూ కూడా రాయాలని, గ్రాంధిక భాష పోవాలని ఉద్యమించిన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29ని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగు దినోత్సవం అనగానే.. సోషల్ మీడియా మొత్తం తెలుగు మీద ప్రేమ వెల్లువెత్తిపోతుంది. తెలుగు భాషను ఉద్ధరించాలని, తెలుగు భాషను కాపాడాలని లక్షలాది మంది తమ కన్నీరు ఒలికిస్తూ ఉంటారు. ప్రభుత్వం తాము తెలుగును ఎంత ఉద్ధరిస్తున్నామో నిరూపించుకోవడానికి కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. కానీ.. భాషను కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనే సంగతిని గుర్తుచేస్తూ పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో.. ఆయన తెలుగు భాష విషయంలో ఏపీ ప్రభుత్వం వైఖరిని కాస్త పరోక్షంగానూ కాస్త నేరుగానూ తూర్పారపట్టారు.
ప్రధానంగా తెలుగు భాష కోసం పనిచేస్తున్న ప్రభుత్వ విభాగాలు ఎంత అవకతవకగా ఉన్నాయో పవన్ తన ప్రకటనలో దెప్పిపొడిచారు. ‘‘తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పని తీరును గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. వారు విడుదల చేసే ప్రకటనల్లోనూ, విద్యా శాఖ నుంచి విడుదలయ్యే ప్రకటనల్లో ఎన్ని అక్షర దోషాలు ఉంటున్నాయో చూస్తేనే తెలుస్తోంది. అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేము.’’ అంటూ పవన్ వారిపై సెటైర్లు వేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అధికారా భాషా సంఘం వారు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో అడుగడుగునా అక్షరదోషాలు ఉండడంతో ఆ సంస్థ నవ్వులపాలైంది. ఆ విషయాన్ని ఇండైరక్టుగా పవన్ తన ప్రకటనలో ప్రస్తావించారు.
‘ఆంధ్ర ప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదు’ అంటూ పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును కూడా ఆక్షేపించారు. జగన్ మోహన్ రెడ్డి తెలుగు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారనే విమర్శలు కూడా ఉన్న సంగతి ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో తెలుగు మీడియంను పూర్తిగా ఎత్తేయాలనే దురుద్దేశంతో సాగుతున్న ప్రభుత్వ సరళిని కూడా పవన్ కల్యాణ్ తెలుగు భాషా దినోత్సవం రోజున పరోక్షంగా దెప్పిపొడిచారు. ‘చిన్నారులు ఓనమాలు నేర్చుకొనే దశ నుంచే మన మాతృ భాషను దూరం చేసే విధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి’ అని చెబుతూ పవన్ కల్యాణ్ ఎన్నికల్లో తెలుగు భాషాభిమానులు అనుసరించాల్సిన విధానం ఏమిటో కూడా ఈ రోజు తెలియజెప్పడం విశేషం.
ఇవాళ తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని దేశప్రధాని మోడీ కూడా అభిలషించారు. ఇవాళ రాష్ట్రం మొత్తం తెలుగు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న భాషా వ్యతిరేక పోకడలకు కుమిలిపోతున్నారు.