నాలుగురోజుల కిందట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్కాపురంలో సభ నిర్వహించారు. ఈబీసీలకు బటన్ నొక్కి నిధులను బదిలీచేశారు. ఇదంతా బాగానే ఉంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మార్కాపురం వాసులకు అనేక వరాలను ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన కుందూరు నాగార్జున రెడ్డిన తన పక్కనే నిల్చోబెట్టుకుని మరీ.. ‘‘నా తమ్ముడు మీ ప్రాంతం కోసం కొన్ని కోరికలు కోరాడు..’’ అంటూ జగన్ వరుసపెట్టి వరాలు కురిపించారు. నా తమ్ముడు వెలిగొండ ప్రాజెక్టు అడిగాడు, అది పూర్తిచేస్తా, ఫలానా అడిగాడు అది శాంక్షన్ చేస్తున్నా, ఫలానా అడిగాడు అది శాంక్షన్ చేస్తున్నా.. అంటూ తన ఎదురుగా ఓ పెద్ద జాబితా పెట్టుకుని.. ఆ జాబితాలో ఉన్నవన్నీ చదివి.. ప్రతిదానికీ ముందర ‘నాతమ్ముడు అడిగాడు..’ అనే వాక్యాన్ని.. దానికి చివరన ‘దానిని శాంక్షన్ చేస్తున్నా’ అనే పదాలను జోడించి జగన్మోహన్ రెడ్డి మొత్తానికి సభను రక్తి కట్టించారు.
‘శాంక్షన్ చేస్తున్నా’ అనే పదాలు సభల్లో తప్పట్లు కొట్టించుకోడానికి చాలా బాగుంటాయి. కానీ వాస్తవంలో శాంక్షన్ అనే పదానికి, పని పూర్తి కావడానికి మధ్య చాలా దూరం ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఇటీవల సస్పెన్షన్ కు గురైన పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన కూడా అదే. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు.. ప్రజల కోరిక మేరకు నియోజకవర్గంలో షాదీఖానా కావాలని అడిగితే.. జగన్ శాంక్షన్ చేశారని, ముఖ్యమంత్రి శాంక్షన్ చేసిన తర్వాత కూడా దానికి అతీగతీ లేదని ఆయన పలు సందర్భాల్లో వాపోయారు. అంటే ముఖ్యమంత్రి ‘శాంక్షన్లు చేయడానికి’.. ఆ పనులు పూర్తయి ప్రజలకు అసలైన సేవలందడానికి మధ్య చాలా తేడా ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే.. ప్రతిదానికీ ‘నా తమ్ముడు నా తమ్ముడు’ అంటూ నాగార్జున రెడ్డి గురించి జగన్ ప్రేమను కురిపించి వెళ్లిన రెండు మూడు రోజులకే అక్కడ తిరుగుబాటు బయల్దేరింది.
వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి , ఎమ్మెల్యే కుందుర్రు నాగార్జున రెడ్డిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వందల కోట్ల విలువైన భూకబ్జాలకు పాల్పడ్డారని అంటున్నారు. ఎమ్మెల్యే తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి మాజీ నక్సలైటు సాగర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ మరో నయీమ్ లాగా భూకబ్జాలు సాగిస్తున్నారని ఆరోపించడం గమనార్హం. బెదిరింపులతో కోట్ల విలువైన భూములు కబ్జా చేస్తున్నారంటూ కొన్ని పత్రాలు కూడా ప్రదర్శించారు. ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మహానటడుని ఎద్దేవా చేశారు. పనిలోపనిగా వచ్చే ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసి తీరుతానని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ప్రకటించడం విశేషం.
జగన్ తన తమ్ముడిగా ఎమ్మెల్యే మీద ప్రేమ కురిపించి వెళ్లిన వెంటనే.. నియోజకవర్గంలో ఈ ముఠా తగాదాలు బయటపడడం గమనించాల్సిన సంగతి. ఈ కుమ్ములాటలను జగన్ ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి.
‘జగన్ తమ్ముడి’ బాగోతాలపై వైసీపీనేత నిందలు!
Sunday, December 22, 2024