‘మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి’ అని సామెత. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సామెతను గుర్తు చేసుకుంటున్నట్టున్నారు. దానినే ఆచరణ రూపంలో పెట్టాలని అనుకుంటున్నట్టున్నారు. చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి, ప్రజల దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలనుకుంటున్న జగన్, అందుకు సుమారు రెండు దశాబ్దాల కిందటి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలననుంచి ఉదాహరణలను తీసుకుంటున్నారు. అక్కడ ప్రారంభించి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్టుగా.. వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పేరు చెప్పి.. ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయించుకోవాలని ఆయన ఆరాటపడుతున్నారు.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. పార్టీని నిత్యం ప్రజల్లోనే ఉంచడం, ప్రజలకు పదేపదే తాము చేసిన పనుల గురించి రిపీటెడ్ గా చెబుతూ ఉండడం ఒక్కటే మార్గం అని జగన్మోహన్ రెడ్డి ఫిక్సయ్యారు. పదేపదే ఒకే విషయాన్ని చెబుతుండడం వల్ల.. నిజానిజాలతో సంబంధం లేకుండా ఆ విషయాన్ని వినేవారి మెదడులోకి చొప్పించవచ్చు అనేది ఒక సిద్ధాంతం. ఆయన ఏ కార్యక్రమం ప్లాన్ చేసినా ఈ సిద్ధాంతానికి అనుగుణంగానే ఉంటోంది. గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ఎమ్మెల్యేలను ఇంటింటికీ తిప్పుతూ సుదీర్ఘ కాల కసరత్తును చాన్నాళ్ల కిందటే ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లడానికి మరో సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనేది కార్యక్రమం పేరు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బతికి బట్టకట్టాలంటే.. జగన్ మాత్రమే మళ్లీ ఎందుకు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉన్నదో ఈ కార్యక్రమం కింద ప్రజలకు వివరిస్తారన్నమాట.
అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుంచి చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పేదరిక నిర్మూలనకు జగన్ సర్కారు చేపడుతున్న పథకాలను ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. పేదరిక నిర్మూలనకు జగన్ సర్కారు చేపడుతున్న పథకాలు అంటే.. ప్రజలకు డబ్బు పంచి పెడుతున్న పథకాలు మాత్రమే. గడపగడపకు కింద కూడా అదే పని జరుగుతోంది. ప్రతి ఇంటికీ తిరుగుతూ.. మీ ఇంటికి మా ప్రభుత్వం ద్వారా ఈ నాలుగేళ్లలో ఇంతేసి సొమ్ములు అందాయి. కాబట్టి మాకు రుణపడి ఉండండి, మాకే ఓట్లు వేయండి అని చెబుతున్నారు. అయితే అభివృద్ధి అనే మాట వచ్చేసరికి- జగన్ సర్కారు చేసిన నిర్మాణాత్మక, నిర్దిష్ట అభివృద్ధి అంటూ ఏమీ లేకుండాపోయింది. కాబట్టి.. అభివృద్ధి అనే మాటకోసం ఎన్నడో 15-20 ఏళ్ల కిందట తన తండ్రి చేసిన పనుల సాయం తీసుకోవడానికి జగన్ ఈ రకంగా ప్లాన్ చేస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్ కొడుకుగా ఏమైనా చేయగలడు అనే ఉద్దేశంతోనే ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారని, ఈ నాలుగేళ్లలో అభివృద్ధి అంటూ ఏమీ చేసి చూపించలేక, ఇప్పుడు తన తండ్రి చేసిన పనులనే మళ్లీ చాటిచెబుతానంటే ప్రజలు బుట్టలో పడకపోవచ్చునని ప్రజలు భావిస్తున్నారు.