జగన్ కోసం.. కేసీఆర్ త్యాగమూర్తి అవతారం!

Sunday, December 22, 2024

గులాబీ దళాన్ని జాతీయ పార్టీగా అవతరింపజేసిన తర్వాత.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఏకంగా ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి ప్రతిరోజూ నాయకులను చేర్చుకుంటున్నారు. మహారాష్ట్రంలో ఓ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీచేస్తామని తొలుత ప్రకటించారు గానీ.. ఆ ఎన్నికల్లో చప్పుడు చేయలేదు. అన్ని రాష్ట్రాల విషయంలో అడుగులు పడుతున్నాయి గానీ.. పొరుగున ఉన్న సోదర రాష్ట్రం ఏపీ విషయంలో కేసీఆర్ విధానం, దూకుడు సంగతేమిటి? అక్కడ, తనకు ఆత్మీయుడిగా, ఆప్తుడిగా ప్రకటించిన జగన్ ఏలుబడికి ఇబ్బంది రాకుండా.. కేసీఆర్ త్యాగమూర్తి అవతారం ఎత్తుతున్నారా? అనే సందేహం కలుగుతోంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్థానంలోని అడుగులు.. ఏపీ విషయంలో మాత్రం మందకొడిగా పడుతున్నాయి. ఎందుకంటే తోట చంద్రశేఖర్ ను, రావెల కిశోర్ బాబు వంటి ఒకరిద్దరిని చేర్చుకోవడం తర్వాత మళ్లీ చప్పుడు లేదు. అప్పటిదాకా జనసేనలో చాలా కీలక నాయకుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ హఠాత్తుగా ఏపీలో బోణీ కొట్టే అవకాశం తక్కువగా ఉండే భారాసలో చేరడం వెనుక.. హైదరాబాదులో ఆయనకున్న రియల్ ఎస్టేట్ దందా ప్రధాన కారణం అనే పుకార్లు కూడా వినిపించాయి. ఆ పరిణామాల తర్వాత కేసీఆర్ ఏపీ రాజకీయాలు, ఏపీలో భారాసా విస్తరణ గురించి ఇప్పటిదాకా పట్టించుకోలేదు.

ఏపీ వ్యవహారాల పట్ల కేసీఆర్ ఎంత నిర్లిప్తంగా ఉంటున్నారంటే.. ఆ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని గుంటూరులో ప్రారంభిస్తే ఆయన వెళ్లలేదు. కనీసం భారాస నాయకులు ఎవ్వరూ తెలంగాణ నుంచి కేసీఆర్ ప్రతినిధులు గా కూడా అక్కడకు వెళ్లలేదు. తోట చంద్రశేఖరే కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ని ఆకాశానికెత్తేశారు. దక్షిణభారత దేశం నుంచి ప్రధాని కాగల అర్హత ఆయనకు మాత్రమే ఉన్నదని కూడా అన్నారు. అయితే కేసీఆర్ ను ప్రధాని చేయడానికి తమ రాష్ట్రం నుంచి ఎన్ని ఎంపీసీట్లను కంట్రిబ్యూట్  చేస్తారో చెప్పలేదు.

అయితే.. కేసీఆర్ , తనకు ఆత్మీయుడు అయిన జగన్ కోసమే ఏపీ ని  పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎక్కడ ఆ మాట చెప్పినా చెల్లుతుంది గానీ.. ఏపీలో భారాస పోటీచేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత చీలుతుందని అనుకోవడం భ్రమ! ఎందుకంటే, ఏపీలో తెలుగుదేశం, జనసేనలకు పడగల ఏ ఒక్క ఓటు కూడా కేసీఆర్ ఖాతాలోకి రాదు. అంతో ఇంతో ఆయనకు పడేవి జగన్ ఓట్లే. ఆ లెక్కన చూసినప్పుడు జగన్ కు నష్టం వాటిల్లుతుంది. అందుకే కేసీఆర్ ఏపీ రాజకీయాల మీద, అక్కడ తమ పార్టీని బలోపేతం చేయడం మీద శ్రద్ధ పెట్టకుండా త్యాగమూర్తి అవతారం ఎత్తుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అదే నిజమైతే.. మధ్యలో రియల్ దందాకోసం పార్టీలో చేరినందుకు తోట చంద్రశేఖర్ బలిపశువు అవుతారన్నమాట.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles