ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. వ్యవస్థలను గుర్తించడం అనేది తనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. న్యాయపరమైన చిక్కులు వివాదాలు ఎలా పొంచి ఉన్నా సరే తాను చేయదలుచుకున్నది చేసేస్తానని తనను ఎవ్వరూ అడ్డుకో జాలరని ఆయన నిరూపిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో పేదలకు 55 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన వైయస్ జగన్ అక్కడ 40 వేలకు పైబడిన ఇళ్ల నిర్మాణాలకు సోమవారం చాలా హడావుడిగా శంకుస్థాపన కూడా చేస్తున్నారు
ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఇలా నిర్మాణానికి అడ్డం పడడం మాత్రమే కాదు కదా, అసలు ఇంటి స్థలాల కేటాయింపులు కూడా రద్దు చేయగల స్థాయిలో ఈ వ్యవహారానికి న్యాయపరమైన ప్రమాదం పొంచి ఉంది. అమరావతి రైతులతో ఒప్పందం చేసుకుని అక్కడి పొలాలను అభివృద్ధి చేసిన తర్వాత యాజమాన్య హక్కు తీసుకునేలాగా సి ఆర్ డి ఏ వ్యవహరించాల్సి ఉంది. అయితే ఒప్పందం ప్రకారం భూములను ఇంకా అభివృద్ధి చేయలేదు. అసలు ప్రభుత్వానికే యాజమాన్యకు హక్కులు లేకపోగా వాటిని 55,000 మంది పేదలకు ఒక్కొక్కరికి సెంట్ స్థలం చొప్పున పంచిపెట్టేయడం అనేది న్యాయపరంగా చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి మాత్రమే లబ్ధిదారులకు స్థలాల మీద యాజమాన్య హక్కులు వస్తాయని ప్రభుత్వం వారికి పంపిణీ చేసిన పట్టాలలోనే స్పష్టంగా పేర్కొంది. ఇచ్చిన ప్రభుత్వానికి, పొందిన లబ్ధిదారులకు కూడా యాజమాన్య హక్కులే లేకపోయినా స్థలాలలో ఇళ్లు నిర్మించడానికి మాత్రం ప్రభుత్వం తొందర పడుతోంది.
హైకోర్టు తీర్పు భిన్నంగా వస్తే గనుక ఇళ్ల నిర్మాణానికి పెట్టిన ఖర్చు మొత్తం వృధా అవుతుంది కదా అనేది న్యాయస్థానం అభిప్రాయం. అదే జరిగితే ప్రత్యామ్నాయంగా సి ఆర్ డి ఏ కు వేరే చోట స్థలాలు ఇస్తాం అని ప్రభుత్వం కోర్టులో చెప్పింది. కానీ ఆ వేరే చోట స్థలాలను పేదలకే ఇవ్వాలని, సి ఆర్ డి ఏ ఒప్పందాన్ని అనుసరించి మాత్రమే అక్కడి స్థలాలపై నిర్ణయం ఉండాలని హైకోర్టు తుది తీర్పు వస్తే గనుక. ఈలోగా పెట్టిన ఖర్చు మొత్తం దండగ అవుతుంది. అలాంటి న్యాయపరమైన చిక్కులేమీ పట్టించుకోకుండా జగన్ శంకుస్థాపనకు ఎగబడుతుండడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది.