పవన్ కల్యాణ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలని అనుకున్న ప్రతని సందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు దత్తపుత్రుడు అనే పదాన్ని వాడుతూ ఉంటారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేస్తుంటారు. తద్వారా ఆయనను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. రెచ్చిపోయే మాట్లాడడంలో పవన్ కల్యాణ్ ఎక్కడైనా మాట తూలుతారేమో అని ఎదురుచూస్తుంటారు. వారి ఎదరుచూపు ఎంత మేర ఫలిస్తున్నదో తెలియదు గానీ.. అదే ‘దత్తపుత్రుడు’ అనే హోదాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా కట్టబెడుతున్నారు.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. కాకపోతే జగన్, ప్రధాని నరేంద్రమోడీకి దత్తపుత్రుడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ ఎక్కువ ద్రోహం చేశారనేది వామపక్షాలు తొలినుంచి చెబుతున్న సంగతి. అలాంటి మోడీకి, ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ దత్తపుత్రుడు అని నారాయణ విమర్శిస్తున్నారు. అలా అనుకోవడానికి ఆయన చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి. కేంద్రంలో మోడీ సర్కారుకు ఎఫ్పుడు ఏ అవసరం వచ్చినా, ఆదుకోవడానికి జగన్ ముందుంటున్నారట. నిత్యం మోడీ కాళ్ల వద్ద పడి ఉంటున్నారట. ఈ కారణాలు మాత్రం దాచినా దాగేవి కాదు. ప్రజలందరూ గమనిస్తున్నవే. కేంద్రంలో సర్కారు ప్రతి అవసరానికి వైసీపీ సహకరిస్తూనే ఉంది. మోడీని కలిసే ప్రతిసందర్భంలోనూ ఆయన పాదాలను మొక్కి ఆశీస్సులు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే నారాయణ ఆయనను దత్తపుత్రుడిగా అభివర్ణిస్తున్నట్టుంది.
దత్తపుత్రుడు అనే పదం ఒక హేళన చేసే మాటలాగా, తిట్టు లాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి సోషల్ మీడియా విభాగం సైనికులు బాగా పాపులర్ చేశారు. తీరా ఇప్పుడు అదే తిట్టు, అదే పదం వారి మీదికే బ్యాక్ ఫైర్ అవుతున్నట్టుగా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక వేదికల మీదనుంచి తన రాజకీయ ప్రత్యర్థులను నిందించడానికి కొన్ని అనుచితమైన మాటలు వాడుతుంటారు. చంద్రబాబు విషయంలో ‘ ఆ ముసలాయన, ఒక ముసలాయన’ అనే పదాలతో ఎగతాళి చేస్తుంటారు. అదే తరహాలో ‘దత్తపుత్రుడు ఉన్నాడు, దత్త పుత్రుడు వస్తాడు’ అంటూ పవన్ ను ఎద్దేవా చేస్తుంటారు.
ఇక మీదట ఇలా తన ప్రత్యర్థి పవన్ కల్యాణ్ ను ఎద్దేవా చేయడానికి ఆయన ఈ మాట వాడే ప్రతిసారీ.. తనను కూడా లోకం మోడీకి దత్తపుత్రుడుగానే భావిస్తున్నదనే సంగతి ఆయన స్ఫురణకు వస్తుందేమో. కనీసం అలా జరిగితే.. నెమ్మదిగా ఇలాంటి చవకబారు విమర్శలు చేయడం మానుకుంటారు. తాను ఒకరి పట్ల ఎలాంటి నిందలు వేస్తారో.. తన గురించి మరొకరు అలాంటి నిందలే వేయగలరనే సత్యాన్ని.. నారాయణ మాటల వల్ల సీఎం జగన్ తెలుసుకుంటే మంచిది.
జగన్ కూడా దత్తపుత్రుడేనట! ఎవరికంటే??
Sunday, November 17, 2024