‘‘మూడు పెళ్లిళ్లు ప్రమాదమా.. బాబాయి హత్య ప్రమాదమా?’’ అని సూటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం అంటే చిన్న విషయం కాదు. వైఎస్సార్ సోదరుడు వివేకానందరెడ్డి హత్య వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉన్నదని, ఆ దిశగా సీబీఐ విచారణ చేపట్టాలని ప్రధాన ప్రతిపక్షాలు నానా యాగీ చేయడం వేరు, అరుదుగా మాత్రమే ఈ అంశం గురించి మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి ఏకంగా.. హత్యను, అందుకు కారకులను కూడా తీర్మానించేస్తున్నట్టుగా.. తేల్చి చెప్పడం వేరు. వివేకా హత్య గురించి నిర్ధరించడం మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి చేస్తున్న చవకబారు ఆరోపణలను కూడా తిప్పికొట్టడం మరో విశేషం.
సీపీఐ నారాయణ తొలినుంచి ముక్కుసూటిగా మాట్లాడే నాయకుడిగా గుర్తింపు ఉంది. ఏ విషయాన్ని అయినా ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఆయనేమీ పనిగట్టుకుని పవన్ కల్యాణ్ కు అనుకూలంగా, ఆయనను కీర్తించేలా మాట్లాడే నాయకుడని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. చేగువేరా బొమ్మలు టీషర్టుల మీద వేసుకుంటూ, చేగువేరా భావజాలం అంటే ఇష్టమని ప్రకటిస్తూ.. పవన్ కల్యాణ్ తాను మాత్రం మతవాద భారతీయ జనతా పార్టీతో అంటకాగడం తప్పు అని హెచ్చరించిన వ్యక్తి నారాయణ. బిజెపితో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ వైఖరిని ఆయన తప్పుబట్టినంతగా మరెవ్వరూ పట్టించుకోలేదు.
అలాంటి నారాయణ ఒక్క విషయంలో మాత్రం పవన్ ను వెనుకేసుకుని వస్తున్నారు. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి, ఆయన భార్యల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండిస్తున్నారు. ఒక పెళ్లికి విడాకులు ఇచ్చిన తరువాత.. ఇంకో పెళ్లి చేసుకుంటే మీకేమిటి నొప్పి అని జగన్ ను నారాయణ ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా వేరే పసలేకపోవడం వల్లనే, పవన్ కల్యాణ్ నిలదీస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతుండడం వల్లనే.. జగన్ ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారనేది నారాయణ తీర్మానం.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కడప ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన సూత్రధారి అవినాష్ మరియు ఆయన తండ్రి భాస్కర రెడ్డి అని విపక్షాలు పదేపదే ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో.. జగన్ కు కూడా ఈ హత్య గురించి ముందుగానే తెలుసునని, ఆయనను, ఆయన భార్య భారతిని కూడా విచారించాలని డిమాండ్లు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. నారాయణ సూటిగా.. బాబాయిని హత్య చేయించడం నేరం కాదా? అంటూ జగన్ ను ప్రశ్నించడం చర్చనీయాంశం అవుతోంది.