తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తరచుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన పదజాలంతో, దూషణలతో విరుచుకుపడుతూ ఉంటారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి ఏడాది ముందుగానే బాగా రాజుకున్న నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు ఇప్పటినుంచే దాదాపు ఎన్నికల ప్రచారం సమయంలో సాగేంతటి తీవ్రమైన ప్రసంగాలతో ప్రత్యర్థి పార్టీని దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. అలాంటి చంద్రబాబునాయుడు.. జగన్ ను నిందించడానికి సరికొత్తి తిట్లను కొత్తగా ప్రయోగిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, తెలుగుదేశం నాయకులుగా గుర్తింపు ఉంటే చాలు.. వారి ఆస్తులను నిబంధనల అతిక్రమణ పేరిట కూల్చివేస్తూ పాల్పడుతున్న దురాగతాలు, ప్రభుత్వం మీద పల్లెత్తు విమర్శ చేస్తే చాలు.. ఎడాపెడా సీఐడీ కేసులు నమోదు చేయడాలు ఇలాంటి వ్యవహారాలతో దూసుకుపోతున్న ప్రభుత్వ వైఖరి గురించి చంద్రబాబు చాలా నిశితంగా విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యవహారాలన్నిటినీ కలగలిపి జగన్ కు సైకో అని చంద్రబాబు ఒక ముద్ర కూడా వేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా.. ‘సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలి’ అనేది ఒక నినాదం కింద చంద్రబాబునాయుడు వాడుకలోకి తీసుకువచ్చేశారు. నిజానికి ఈ నినాదాన్ని ఆయన చాలా చాలా పాపులర్ చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ ‘రావాలి జగన్, కావాలి జగన్’ అనే నినాదం ఎంతగా రిథమిక్ గా పాపులర్ అయిందో.. అదే స్థాయిలో ‘సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలి’ అనే నినాదం కూడా పాపులర్ అయింది.
అలా జగన్ మీద సైకో అనే ముద్ర వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు తన కడప జిల్లా పర్యటనలో తొలిరోజే… మరింత తీవ్రంగా విరుచుకుపడడం గమనార్హం. వైఎస్ భాస్కర రెడ్డి అరెస్టు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సంకట పరిస్థితులను ఎదుర్కొంటుండడం, భాస్కరరెడ్డి అరెస్టుకు నిరసనగా కడపలో పార్టీ ధర్నా నిర్వహిస్తే సొంత పార్టీ కౌన్సిలర్లే మెజారిటీ మొహం చాటేయడం వంటి అనేకానేక పరిణామాల నేపథ్యంలో.. కడపజిల్లాలో చంద్రబాబు మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు.
‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాన్ని ఎద్దేవా చేస్తూ, చంద్రబాబు, భవిష్యత్తు కాదు- జగనే రాష్ట్రానికి దరిద్రం, ప్రజల పాలిట సైతాన్, రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న భూతం అని చంద్రబాబు అంటున్నారు. రాజకీయాలలో అదుపు తప్పి నేతలు పరస్పర విమర్శలు చేసుకోవడం చాలా మామూలు సంగతి అయిపోయింది. చంద్రబాబు గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకంటె నీచమైన పదజాలంతో దూషిస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు కొత్త తిట్లను జగన్ కు ముడిపెట్టేస్తున్నారు.
జగన్ కు కొత్త బిరుదులు దరిద్రం, సైతాన్, భూతం!
Sunday, December 22, 2024