ఒక బాబాయి హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుకఉన్న కీలక సూత్రధారి అనే అనుమానాలతో ఇంకో బాబాయి ఇప్పుడు అరెస్టు అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇది బాధాకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితి. పులివెందులలో చిన్నపాటి హైడ్రామా మధ్య వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారం ఉదయమే సీబీఐ వారు అరెస్టు చేశారు. వివేకా హత్య జరిగి నాలుగు సంవత్సరాల తరువాత కేసు ఒక కొలిక్కి వచ్చే క్రమంలో ఈ అరెస్టు చాలా కీలక పరిణామంగా అందరూ భావిస్తున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన నాటినుంచి దీని వెనుక సూత్రధారులుగా వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి పాత్ర గురించి పుకార్లు వినిపిస్తూనే వచ్చాయి. హత్య చేసినట్లుగా అనుమానిస్తున్న నిందితులు, అప్రూవర్ గా మారిన దస్తగిరి వెల్లడించిన వివరాలు, మిగిలిన నిందితులనుంచి నమోదు చేసిన వాంగ్మూలాలు అన్నింటినీ క్రోడీకరిస్తూ అవినాష్, భాస్కర్ రెడ్డి లకు తెలిసే ఈ హత్య జరిగిందని సీబీఐ ఒక నిర్ధారణకు వచ్చింది. తండ్రీ కొడుకులు ఇద్దరినీ హైదరాబాదుకు పిలిపించి విచారించింది. అయితే భాస్కరరెడ్డి విచారణకు సహకరించలేదని కూడా వార్తలు వచ్చాయి. ఈ విచారణల సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ తీరు మీదనే అనేక నిందలు వేశారు. సీబీఐ తమ ప్రత్యర్థుల స్కెచ్ మేరకు నడుస్తున్నదని అన్నట్లుగా ఆరోపణలు చేశారు. తమ సొంత బాబాయిని ఎందుకు చంపుకుంటామని అంటూ, తనను తన తండ్రిని ఈ హత్యకేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా అవినాష్ రెడ్డి అన్నారు.
ఇదిలా ఉండగా, వివేకా హత్య కేసు చురుగ్గా దర్యాప్తు జరుగుతున్న సమయాల్లో జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకుని అమిత్ షా, మోడీలను కలిసినప్పుడెల్లా.. ఈ కేసునుంచి తన తమ్ముడు అవినాష్ రెడ్డిని బయటపడేయడానికే ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తుండేవి. దానికి తగ్గట్టుగా తమ సొంత కుటుంబంలో హత్య చేయించే అవసరం అవినాష్ కు ఎందుకు ఉంటుందంటూ జగన్ కూడా గతంలో సమర్థించారు.
తీరా ఇప్పుడు జగన్ బాబాయి, ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డిని సీబీఐ వారు అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాదుకు తరలిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాదు నివాసంలో ఉన్న అవినాష్ రెడ్డి కోసం కూడా సీబీఐ వారు వెళ్లారనే పుకార్లు వచ్చాయి. కానీ ఇది నిజం కాదని తేలింది. అవినాష్ రెడ్డి మిత్రుడు హత్య సమయంలో దానిని గుండెపోటుగా మానిప్యులేట్ చేయడంలో కీలకంగా ఉన్నాడని అంటున్న ఉదయకుమార్ రెడ్డిని అరెస్టుచేసిన సీబీఐ, రోజుల వ్యవధిలోనే భాస్కర రెడ్డిని కూడా అరెస్టు చేయడం కీలకంగా కనిపిస్తోంది. కేసు ఎలా తేలినప్పటికీ.. వ్యక్తిగత ప్రతిష్ఠ పరంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ పరిణామాలు ఇబ్బందికరమైనవే అని పలువురు భావిస్తున్నారు.
జగన్ కు ఇబ్బందే : భాస్కర రెడ్డి అరెస్టు!
Sunday, November 17, 2024