అధికార వికేంద్రీకరణ పేరుతో విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుచేస్తాం అని ప్రకటించిన నాటినుంచి.. ఉత్తరాంధ్ర మీద తనకు ప్రేమ వెల్లువెత్తిపోతున్నట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతుంటారు. కానీ ఆచరణలో జరుగుతోంది ఏమిటనేది కేవలం మాటలను మాత్రం ఫాలో అయ్యే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే ఉత్తరాంధ్ర మీద జగన్ కు ఉన్నది కపటప్రేమ అని, కేవలం విశాఖ ఆస్తులను దోచుకోవడానికి మాత్రమే రాజధాని డ్రామా ఆడుతున్నారని.. ఉత్తరాంధ్ర సరిహద్దుల్లో రౌడీయిజం చేస్తున్న పార్టీ వైసీపీ అని చంద్రబాబు నాయుడు తూర్పారపట్టారు.
విజయనగరం జిల్లాలో విపరీతమైన జనం స్పందన మధ్య మూడు రోజులుగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు.. విజయనగరం కోట వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాంద్ర పట్ల జగన్ చిన్నచూపు గురించి ప్రత్యేకంగా వివరాల సహా ప్రస్తావించారు.
జగన్ ప్రభుత్వంలో 60 మంది సలహాదారులు ఉండగా.. కనీసం ఒక్కరు కూడా ఉత్తరాంధ్ర వారు లేరని, తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలిలో కూడా ఉత్తరాంధ్రకు కనీస ప్రాతినిధ్యం లేదని ఆయన చెప్పుకొచ్చారు. సలహాలు ఇవ్వడానికి తగిన వ్యక్తి ఉత్తరాంధ్రలో ఒక్కరు కూడా కనిపించలేదా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ కేవలం విశాఖ ఆస్తుల మీద కన్నేసి రాజధాని డ్రామా ఆడుతున్నారు తప్ప.. ఉత్తరాంధ్ర మీద ప్రేమతో కానేకాదని చెప్పారు.
ఒకవైపు విశాఖలో పరిపాలన రాజధాని వద్దంటున్నవారు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడానికే వీల్లేదని బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వాళ్లు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలోనే.. అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి రాజధానిని మాత్రమే సపోర్టు చేస్తున్న చంద్రబాబునాయుడు కార్యక్రమాలకు విజయనగరం జిల్లాలో ప్రతి చోటా జనం భారీగా వెల్లువెత్తుతుండడం విశేషం. ఉత్తరాంధ్రలో దక్కుతున్న జనం స్పందనను గమనిస్తే.. జగన్ పతనం తనకు కళ్లెదురుగా కనిపిస్తోందని చంద్రబాబునాయుడు అంటున్నారు.
నిజానికి విశాఖలో రాజధానికి ముడిపెట్టి.. ఉత్తరాంధ్ర మొత్తం బాగుపడిపోతుందనే మాయమాటలతో ఎంతగా ఊదరగొడుతున్నప్పటికీ.. ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ సభలకు అంతగా ఎలా నీరాజనాలు పడుతున్నారో వైసీపీ శ్రేణులకు అర్థం కావడం లేదు. ఉత్తరాంధ్రలో కూడా చంద్రబాబు సభలకు జనం వెల్లువ ఇలాగే కొనసాగితే.. ఎన్నికలు- ఫలితాల సంగతి తర్వాత.. తమ మూడురాజధానులు అనే నాటకానికి నైతికంగా దెబ్బ అవుతుందని, ప్రజల మద్దతు కోల్పోయినట్లు అవుతుందని వారు అనుకుంటున్నారు. ప్రత్యేకించి.. ‘‘ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి తాబేదార్ల వద్ద తాకట్టు పెట్టకండి..’’ అంటూ చంద్రబాబు బొత్స, ధర్మానలను ఉద్దేశించి అనడం విశేషం.
జగన్ కపటప్రేమను కడిగేసిన చంద్రబాబు!
Friday, November 15, 2024