‘మాటతప్పను.. మడమ తిప్పను’ అని తనకు తానే టముకు వేసుకునే నేత జగన్మోహన్ రెడ్డి.. అమరావతి రాజధాని విషయంలో మాట తప్పి, మడమ తిప్పి.. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతగా వంచించారో అందరికీ తెలుసు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు శాసనసభ వేదికగా మద్దతిచ్చి, తాడేపల్లిలో నివాసం నిర్మించుకోవడం ద్వారా.. చంద్రబాబు కంటె నాకే ఎక్కువ శ్రద్ధ.. ఇల్లు కూడా కట్టుకున్నా ఇక్కడే రాజధాని అని చెప్పి.. అమరావతి నుంచి రాజధాని తరలిపోదు అని ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించి.. అధికారంలోకి రాగానే.. అందుకు విరుద్ధంగా అమరావతి ప్రాంతాన్ని శ్మశానంలా మార్చిన తీరు జగన్ ది. ఆయన ఎంత దారుణంగా మాటతప్పి, మడమ తిప్పినప్పటికీ.. అమరావతి రైతులు మాత్రం అలుపెరగని పోరు సాగిస్తున్నారు. తమ త్యాగాలకు ఫలమైన అమరావతి రాజధానిని సాధించుకోవడానికి.. అసలు సిసలు మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తున్నారు. తాజాగా అమరావతి రాజధాని విషయంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న అరాచక పోకడలను, ఢిల్లీ పాలకులకు తెలియజెప్పేలా.. జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీల పెద్దలు, నాయకుల దృష్టికి జగన్ అరాచకత్వం గురించి తెలిపేలా ఉద్యమించనున్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు, కూలీలు 1600 మంది ప్రత్యేక రైలులో బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. 17వ తేదీన జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తారు. 18న బృందాలుగా విడిపోయి వివిధ పార్టీల నేతలను ఎంపీలను కలిసి అమరావతి విషయంలో జరుగుతున్న ద్రోహాన్ని వివరిస్తారు. 19న రామ్ లీలా మైదానంలో భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహించే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు.
అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం తమ మొండి వైఖరిని కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అమరావతిలో సగంలో ఉన్న పనులను పూర్తి చేయడం గురించి కూడా దృష్టి సారించకపోగా.. సుప్రీంలో కేసులు వేసి మరింత జాప్యానికి కారణం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా తెలియజెప్పడానికి ఆ ప్రాంత రైతులు కంకణబద్ధులు కావడం విశేషం. గతంలో తిరుమల దాకా పాదయాత్ర నిర్వహించిన, అరసవిల్లి పాదయాత్రకు వైసీపీ అల్లర్లతో మధ్యలో విరామం ఇచ్చిన అమరావతి రైతులు.. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో జంతర్ మంతర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడానికి పూనుకోవడం విశేషం. కేంద్రం ఎప్పటికప్పుడు రాజధాని అనే నిర్ణయంలో కేంద్రానికి సంబంధం లేదని అంటూ తప్పించుకోజూస్తున్నప్పటికీ.. ఈ రైతుల పోరాటం జగన్ అకృత్యాలపై కేంద్రంలోని పెద్దల కళ్లు తెరిపించడానికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అమరావతి నినాదాలతో హస్తినాపురం ప్రతిధ్వనించిన తర్వాత అయినా.. జగన్ వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.
జగన్ అరాచకత్వంపై హస్తినవేదికగా పోరు!
Wednesday, January 22, 2025