వేమన విగ్రహాన్ని తొలగించి వైఎస్సార్ విగ్రహం పెట్టడం అనే వ్యవహారం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. వేమన పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేసి.. వేమనకు అవమానం కలిగేలాగా.. ఆయన విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం పెట్టడం అనేది రాష్ట్రంలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. రాష్ట్రంలో ఎన్ని ఊర్లలో ఎందరు నాయకుల విగ్రహాలు తొలగించి వైఎస్సార్ విగ్రహాలు పెట్టినా సరే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టినా సరే.. రేగనంత రచ్చ వేమన విగ్రహం తొలగింపు గురించి జరుగుతోంది. మామూలు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని తమ వాడు అనుకుని, ఆయనకు మద్దతుగా నిలిచే రెడ్డి సామాజిక వర్గం.. ఇప్పుడు గుస్సా అవుతోంది. జగన్ వైఖరిపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది.
వైఎస్సార్ ను ఇవాళ రెడ్లు అందరూ ‘తమ వాడు’ అనుకుంటూ ఉండవచ్చు గానీ.. వైఎస్సార్ పుట్టకముందునుంచి కూడా అలాంటి ఆదరణ వేమనకు ఉంది. రెడ్డి సామాజిక వర్గంలో ఈ వేమారెడ్డిని దేవుడిగా కొలిచే వాళ్లున్నారు. వేమన పద్యాల సాహిత్యాన్ని విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడానికి లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రెడ్డి ప్రముఖులు ఉన్నారు. వేమన జయంతిని ఒక పండుగలాగా రెడ్లు నిర్వహిస్తూ ఉండడం కూడా కద్దు. రెడ్ల ప్రాబల్యం, ఓటు శాతం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీచేసే నాయకులు పార్టీలతో, కులాలతో నిమిత్తం లేకుండా తాము విడుదల చేసే ప్రకటనల్లో అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా.. అంబేద్కర్, ఫూలే వంటి వారి బొమ్మలతో పాటు వేమన బొమ్మను కూడా ప్రచురిస్తూ ఉంటారు.
రెడ్లు ఇంతగా ఆరాధించినా, ఆరాధించకపోయినా వేమన తెలుగుజాతికి అంతటి ప్రముఖమైన వ్యక్తే. వేమన పద్యాల ద్వారా ఆయన కృషి అసామాన్యమైనది. అలాంటి మహానుభావుడి పేరుతో కడపజిల్లాలోని యూనివర్సిటీకి వేమన యూనివర్సిటీ అని నామకరణం చేయడం ద్వారా అప్పట్లో ప్రభుత్వం మంచిగానే మొక్కు చెల్లించుకుంది.
కానీ వర్తమానంలోకి వచ్చేసరికి వేమనకు అవమానం జరిగింది. ఆయన విగ్రహాన్ని తొలగించేసి.. అదే స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది కుల మత రహితంగా ఉండే వేమన అభిమానులకు మాత్రమే కాదు కదా.. రెడ్డి వర్గం వారికి కూడా తీవ్రమైన ఆగ్రహం కలిగిస్తోంది. జగన్ కూడా మనవాడే అని ఆ వర్గం వారంతా అనుకుంటున్న నేపథ్యంలో.. మనవాడే.. వేమనకు ద్రోహం చేస్తాడా అని వారు రగిలిపోతున్నారు. ఇప్పుడు జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోకపోతే.. రెడ్డి వర్గం అసంతృప్తి ఎన్నికలనాటికి కూడా కొనసాగి.. జగన్ మీద ప్రభావం చూపించే ప్రమాదం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.