బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇటీవలి కాలంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా చాలాసార్లు చర్చల్లోకి వస్తోంది. సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదికల్లో జగన్ పేరు ప్రస్తావన కూడా వచ్చింది. హత్య జరిగిన రోజు ఉదయం 6 గంటల తర్వాత జగన్ కు ఆ సమాచారం తెలిసినట్టుగా ప్రచారంలో ఉంది. అయితే అంతకంటె ముందే ఆయనకు వార్త తెలిసిందని సీబీఐ పేర్కొంది. ఈ విషయాన్ని పట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు.. జగన్ ను కూడా సీబీఐ పిలిపించి విచారిస్తే తప్ప వాస్తవాలు బయటకు రావని అంటున్నారు. జగన్ భార్య భారతి బంధువుల పాత్ర కూడా ఉన్నట్టు వివిధ వాంగ్మూలాల్లో నమోదు అయింది. ఈ నేపథ్యంలో జగన్ దంపతులను ఇద్దరినీ పిలిపించి విచారించాల్సిన అవసరం ఉన్నదని రఘురామక్రిష్ణరాజు అంటుండడం విశేషం.
రఘురామక్రిష్ణరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంటి నలుసులాగా మారిన నాయకుడు. ఆయన ఆ పార్టీ తరఫునే గెలిచారు. ఆ పార్టీ మీద తిరుగుబాటు ప్రకటించి.. గత నాలుగేళ్లుగానూ వారిని అనేక రకాలుగా చికాకు పెడుతుంటారు.
అయితే న్యాయపరమైన అంశాలపై అవగాహన ఉన్న రఘురామ.. పార్టీ తన మీద అనర్హత వేటు వేయకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతుండడం మనం గమనిస్తుంటాం. మరొక పార్టీ జెండా కప్పుకోరు. అలాగని సొంత పార్టీ జెండా కూడా కప్పుకోరు. చంద్రబాబును, లోకేష్ ను, భాజపా నాయకులను భయంకరంగా కీర్తిస్తుంటారు. అలాగని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిందించరు. పొగుడుతూ ఉంటారు. మా పార్టీ చాలా గొప్పది. చాలా మంచి వాగ్దానాలు చేసింది. కానీ, జగన్ సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వం దుర్మార్గమైనది, ప్రజలకు ద్రోహం చేస్తున్నది అంటూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే మాట రాకుండా జాగ్రత్తపడుతుంటారు.
అలాంటి ఆర్ఆర్ఆర్ కొంత కాలంగా.. వివేకాహత్య కేసులో జగన్మోహన రెడ్డి పాత్ర గురించి అనేక ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ గురించి సుప్రీం కోర్టులో కూడా విచారణ జరగనున్న నేపథ్యంలో.. అసలు జగన్ దంపతులు ఇద్దరినీ సీబీఐ విచారిస్తే తప్ప వాస్తవాలు బయటకు రావని ఆయన అనడం కలకలం రేపుతోంది. పైగా జగన్ ను విచారించడం లేదు గనుక.. సీబీఐ ఉదాసీన వైఖరి అవలంబిస్తోందంటూ ఆయన నిందలు వేయడం విశేషం.
లీగల్ గా టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుతూ చికాకు పెడుతూ ఉండే రఘురామ ఇప్పుడు వివేకా హత్య కేసును జగన్ కే ముడిపెడుతూ డైరక్టు ఎటాక్ కు దిగుతున్నారు. జగన్ ను సీబీఐ పిలిచి విచారించే దాకా ఆయన ఊరుకోరేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్‌ను సీబీఐ పిలిస్తే తప్ప ఆయన ఊరుకోరా?
Sunday, November 17, 2024