జగన్‌ను వీడి పారిపోతున్న తమ్ముళ్లు!

Wednesday, January 22, 2025

2024 ఎన్నికల ఘట్టం సమీపించే లోగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది మిగులుతారో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి అధికార పార్టీ చాలా బలంగా ఉండాలి. అధికారంలో ఉన్నారు గనుక వారి నీడను వీడి బయటకు వెళ్లడానికి ఎవరూ సిద్ధపడకుండా ఉండాలి. కానీ ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అలా కనిపించడం లేదు. ఎవరికి వారు తమ సొంతదారులు చూసుకుంటున్నారు. పెద్దాచిన్నా నాయకులు అనేకమంది ఇతర పార్టీలలోకి వలస వెళ్లడానికి మార్గం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిణామాల సంకేతం ఏమిటి? ఇందరు నాయకులు అధికార పార్టీని వదిలి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారంటే దాని అర్థం రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పదు అని వారందరూ అంచనా వేస్తున్నట్లు కదా అనే చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తోంది!
నెల్లూరు జిల్లా రాజకీయాలు, రాబోయే రోజుల్లో బయటపడగల మిగిలిన వలస వార్తల ముందు చిన్నబోయేలా కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ తెలుగుదేశం లో చేరబోతున్న సంగతి ఇప్పుడు బహిరంగ రహస్యం. జగన్ పాలన మొదలైన ఐదు ఏళ్లలో నిర్దిష్టమైన అభివృద్ధి అంటూ ఏదీ జరగనేలేదని.. ప్రజలకు తాము మొహం చూపించలేకపోతున్నామని మాటలు చెబుతూ వాళ్ళు వైసిపిని వీడుతున్నారు. నిజానికి నెల్లూరు జిల్లాలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం తీర్థం కోసం నిరీక్షిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

నెల్లూరు తలనొప్పులను సరిదిద్దుకోవడానికే పార్టీ వ్యూహకర్తలకు సమయం చాలకపోతుండగా మరోవైపు ఇతర ప్రాంతాల్లో కూడా వలసలకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. గతంలో చీరాల ఎమ్మెల్యేగా కూడా సేవలందించిన కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరబోతున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్, ఆమంచి శ్రీనివాసులు ఫోటోలతో జనసేన సభ్యత్వ నమోదు గురించి ఆ నియోజకవర్గ పరిధిలోని వేటపాలెంలో వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ ను ఇటీవలే పరుచూరు నియోజకవర్గం ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ నియామకం పట్ల ఆయనలో అసంతృప్తి ఏ రీతిగా ఉన్నదో తెలియదు కానీ ఆయన తమ్ముడు మాత్రం వైసీపీని వీడి జనసేనలోకి వెళుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండి ఎన్నికలు వచ్చే సమయానికి ఆమంచి కృష్ణమోహన్ కూడా జనసేనలోకే ప్రవేశిస్తారేమో అనే సందేహాలు కూడా పలువురికి కలుగుతున్నాయి.
అదే సమయంలో నంద్యాల జిల్లాలోని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు, సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తో ఉండే ముఠా కక్షలు పర్యవసానంగా బిజ్జం పార్థసారధి రెడ్డి పార్టీ మారబోతున్నట్టు సమాచారం.
ప్రజలు భావిస్తున్నది ఏమిటంటే.. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఈ నాయకులకు నచ్చని, ఇమడలేని వాతావరణమే ఉండవచ్చు గాక! అంతమాత్రాన ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంటే పార్టీని వీడి ఎందుకు వెళతారు? రాబోయే ఐదేళ్లలో తమ రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకోవడానికి ఎందుకు సాహసిస్తారు అనేది మాత్రమే! వైసీపీ నుంచి ఇతర పార్టీలలోకి పారిపోవడానికి, వలస వెళ్లడానికి ఇలా పెద్ద సంఖ్యలో నాయకులు క్యూ కడుతున్న వాతావరణం.. ఆ పార్టీ పతనాన్ని నిర్దేశిస్తుందా అనే అభిప్రాయం అందరికీ కలుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles