ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలే చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పంతానికి పోయి కోర్టుకు వెళ్లిన దాదాపు ప్రతి వ్యవహారంలో ఆయనకు ఎదురుదెబ్బ తగులుతోంది. తమ చర్యల వల్లనే తమ పరువు మంటగలిసిపోతున్నది తప్ప.. బయటినుంచి ఎలాంటి ప్రమాదమూ ముంచుకురావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరో విషయంలో కూడా ఆయన అభాసుపాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదేమీ కోర్టు ద్వారా జరుగుతున్న పరువునష్టం కాదు గానీ.. జగన్ ను ఇంప్రెస్ చేయడానికా అన్నట్లుగా పార్టీ నాయకులు అత్యుత్సాహంతో చేస్తున్న ప్రకటనలు పరువు తీసేలా కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, ఉత్తరాంధ్రలో పార్టీ వ్యవహారాలకు ఇన్చార్జిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తాజాగా మరోసారి రాజధాని ప్రస్తావన తెచ్చారు. త్వరలోనే విశాఖపట్నం కు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలి రానున్నదని వైవీ ప్రకటించారు. నిజానికి రాజధాని ఎప్పుడో ఇక్కడకు రావాల్సి ఉన్నదని.. అయితే న్యాయపరమైన చిక్కుల వల్ల ఆలస్యం అవుతోందని కూడా వైవీ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే తన నివాసాన్ని విశాఖకు మారుస్తున్నారని, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ రాజధాని కూడా వచ్చేస్తుందని సెలవిచ్చారు.
పనిలో పనిగా.. విశాఖ గురించి ఆయన చాలా పొగడ్తలు కురిపించారు. దక్షిణ భారతదేశానికి ముంబాయి వంటి మహానగరం విశాఖ అని, అన్నిప్రాంతాల ప్రజలు నివసించడానికి యోగ్యమైన నగరం అని రకరకాలుగా కీర్తించారు. అయితే.. విశాఖకు రాజధాని వచ్చేస్తున్నదని వైవీ ప్రకటించడం ఇది తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు చెప్పారు. కానీ మాట మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. న్యాయపరమైన చిక్కుల గురించి ఆయనే అంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి నివాసాన్ని విశాఖకు మార్చుకోవడం అనేది ఆయన ఇష్టం. అయితే పరిపాలన రాజధానిని మార్చడం కూడా ‘నా ఇష్టం’ అన్నట్టుగా వ్యవహరిస్తే కుదరదు. అందుకు లీగల్ చిక్కులు ఉంటాయి. ‘మరో మూడు నెలల్లో..’ అని వైసీపీ నేతలు దాదాపు రెండేళ్ల నుంచి విశాఖ వాసులను ఊరిస్తున్నారు. ఇప్పుడుకూడా వైవీ అదే అంటున్నారు. మూడునెలల్లో కాపురం మార్చవచ్చు గానీ.. రాజధాని మార్పు కష్టం అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
వైవీ మాత్రమే కాదు, మొన్నటికి మొన్న మంత్రి గుడివాడ అమర్నాధ్ కూడా ఇలాంటి ప్రకటన చేశారు. మంత్రుల్లో ఎవరికి వారు.. విశాఖ వెళ్లినప్పుడెల్లా.. రాజధాని తరలింపు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే వీరి ప్రకటనలన్నీ కలిసి.. జగన్ ను అభాసుపాల్జేస్తాయనేది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే.. ఆచరణలోకి రాకుండా కేవలం మాటలు మాత్రమే చెబుతున్నట్టుగా ఇది కనిపిస్తోంది. జగన్ కూడా రాజధాని తరలింపు విషయంలో సుప్రీం ఉత్తర్వుల కోసం వేచిచూసే ధోరణిలో కాస్త మౌనం పాటిస్తుండగా.. ఆయనను ఇంప్రెస్ చేయడానికా అన్నట్టుగా నాయకులు మాత్రం రెచ్చిపోయి ఇస్తున్న హామీలు పార్టీకి నష్టమే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.