చుక్కల భూములకు పట్టాలివ్వడం, రైతులకు వాటి మీద అధికారాలు కల్పించే విషయంలో రెవెన్యూ అధికారుల అలసత్వ ధోరణి.. ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం కారణంగా ఒక రైతు అన్యాయంగా బలైపోయారు. చుక్కల భూములకు పట్టాలివ్వకపోవడం వలన తమ పొలాలు అమ్ముకోలేక, వాటిని సేద్యం చేసుకునే స్తోమత లేక, అప్పులు తీర్చలేక ఆవేదనలో ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా రైతు ఓ లేఖ రాసి మరీ చనిపోయారు. ఈ విషాద ఘటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా లోనే చోటు చేసుకోవడం గమనార్హం. వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం తుడుములదిన్నె అనే గ్రామంలో వెంకట సుబ్బారెడ్డి అనే రైతు తన మరణానికి రెవెన్యూ అధికారులతో పాటు స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం అని లేఖలో పేర్కొనడం సంచలనంగా మారుతోంది!
రైతు వెంకటసుబ్బారెడ్డికి 8 ఎకరాలకు పైగా చుక్కల భూమి ఉంది వ్యవసాయంలో కాలం కలిసి రాకపోవడంతో పది లక్షల రూపాయల దాకా అప్పులు పాలైనట్లుగా చెబుతున్నారు. పొలాన్ని అమ్మకానికి పెడితే చుక్కల భూమి కావడం, పైగా అది తల్లి పేరుతో ఉండడంతో కొనడానికి ఎవరికీ ముందుకు రాలేదనేది సమాచారం. వారసత్వపు హక్కుల కింద తల్లి పేరుతో ఉన్న భూమిని తన పేరు మీదికి మార్పించాల్సిందిగా వెంకటసుబ్బారెడ్డి రెవెన్యూ అధికారుల చుట్టూ కొన్నాళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడిన ఆయన కనీసం ఇకనైనా తన పిల్లల పేరిట భూమికి పట్టాలు ఇవ్వాలని వాళ్లు దానిని అమ్మి అప్పులు తీరుస్తారని లేఖలో విన్నవించడం విశేషం. రైతులందరికీ కూడా చుక్కల భూములకి పట్టాలివ్వకపోతే వారి జీవితాలు దారుణంగా మారుతాయి అని ఆయన ప్రభుత్వాన్ని కోరడం గమనించాలి.
వైయస్సార్సీపి ప్రభుత్వం తమకు తోచిన రీతిలో తోచిన పనులు మాత్రమే చేసుకుంటూ వెళుతోంది తప్ప ప్రజలకు నిజంగా ఏం అవసరాలు ఉంటున్నాయో, వారి కష్టాలు ఎలా ఉంటున్నాయో పట్టించుకుని వాటిని తీర్చడంపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు పుష్కలంగా వినిపిస్తున్నాయి. రైతుల ఖాతాల్లోకి బటన్ నొక్కి డబ్బులు బదిలీ చేస్తున్నామని చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో రైతులు వాస్తవంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా యంత్రాంగాన్ని నడిపించలేకపోతున్నారని ముఖ్యమంత్రి గురించి రైతుల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. తాజాగా ఆత్మహత్య చేసుకున్న వెంకటసుబ్బారెడ్డి లేఖలో ప్రస్తావించిన విషయాలు కూడా ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని సామాన్య రైతులకే ఆయన మీద విశ్వాసం సడలిపోతే ఇక రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మరింత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్ వారిలో ఏ రకంగా భరోసా నింపుతారో వేచి చూడాల్సి ఉంది.