అధికారంలో ఉన్న పార్టీకి ఆటుపోట్లు సహజం. అయితే అవి సాధారణంగా బయట నుంచి ఉండాలి. అధికారంలో ఉన్న వారిని చూసి ఓర్వలేని ఇతర పక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు వారి మీద విమర్శలు చేస్తూ ఉంటే.. వాటితో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఇబ్బందులు పడే వాతావరణ మాత్రమే మనము ఊహించదగినది.
అధికార పార్టీలో ఉన్నవాళ్లు తమలో తాము కొట్టేసుకుంటూ ఉండే ప్రత్యేక పరిస్థితులు ఎక్కడో కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంటాయి. అందుకు చాలా ప్రత్యేకమైన స్థానిక కారణాలు ఉంటాయి. కానీ అధికార పార్టీలో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ ముఠాలు, ముఠాల మధ్య తగాదాలు ఒకరి గురించి ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఒకరి వర్గంతో మరొకరు కలబడుకోవడం.. అతి తరచుగా పార్టీ పరువును బజారున పడేయడం చాలా తక్కువగా మాత్రమే జరుగుతుంది. ఈ సకల విభేద అవ లక్షణాలు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రమంతా ఎటు చూసినా పుష్కలంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే రమేష్ బాబు వర్గీయులు తలపడి ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడమే ఇందుకు పరాకాష్ట!
నాయకులు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటూ ఉంటే పార్టీ హై కమాండ్ ఉపేక్షిస్తూ సైలెంట్ గా ఉండడం చాలా అరుదు. నాయకులు అందరూ ఐక్యంగా ఉండి బలంగా తయారైతే తమకు ముప్పు వస్తుందని భయపడే సందర్భాలలో మాత్రమే హై కమాండ్ వర్గాలను ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారం మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ‘కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ’ అనే ఒక అందమైన వాక్యాన్ని ముసుగు కింద పెట్టుకుని సకల అరాచక ముఠా తగాదాలను ప్రోత్సహించడం ఆ పార్టీ లక్షణం. అధికారం– కుటుంబ వాదసత్వం లాగా దక్కిన పార్టీ మీద పట్టు ఎక్కడ చేజారిపోతుందే అనే భయం బహుశా పార్టీలో అంతర్గతంగా ముఠాలను ప్రేరేపించడానికి ఒక కారణం కావచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా కాదు. ఇది జగన్ సొంతంగా నిర్మించుకున్న తన సొంత పార్టీ. ఆయన కంటే బలంగా మరొకరు తయారు కాగల అవకాశం ఆ పార్టీలో లేదు. మరి అలాంటప్పుడు పార్టీలోని అంతర్గత ముఠాతగాదాల విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? అనేది ఎవరికీ అర్థం కాని సంగతి. ఇంకా లోతుగా పరిశీలిస్తే కొన్ని నియోజకవర్గాలలో పార్టీ అధిష్టానం స్వయంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది.
ప్రస్తుతానికి పార్టీ హైకమాండ్ ఆశించే సంకుచిత ప్రయోజనాలు ఎలాగైనా ఉండవచ్చు కానీ, ఇలాంటి ముఠాల వలన పార్టీకి దీర్ఘకాలంలో చేటు జరుగుతుంది అని వారు తెలుసుకోవాలి. వైసీపీలో రాష్ట్రమంతా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి ఉంది. ఈ వాతావరణాన్ని కట్టడి చేయడానికి అధినేత జగన్ స్వయంగా చొరవ తీసుకోవాలి. రాజీ కుదిర్చడానికి మధ్య స్థాయిలోని వ్యక్తులను పురమాయిస్తే దక్కే ప్రయోజనాలు తక్కువ అని ఆయన తెలుసుకోవాలి.