చేరికలు ఉంటే.. చంద్రబాబుకు అది కొత్త జోష్!

Saturday, January 18, 2025

చంద్రబాబునాయుడు విజయశంఖారావం పూరించబోతున్నారు. చాలాకాలం తర్వాత తెలంగాణలో ఆ పార్టీ బహిరంగసభ జరగబోతోంది. ఒకప్పట్లో పార్టీకి ఎంతో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఖమ్మం జిల్లాలోనే చంద్రబాబు విజయశంఖారావం పూరించబోతుండడం విశేషం. కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ తెలుగుదేశానికి కొత్త సారథి అయిన తర్వాత.. పార్టీ బలోపేతం కావడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే.. ఖమ్మంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు అయింది. దాదాపు లక్షమందితో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ విజయవంతం అయితే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సెకండిన్నింగ్స్ నిరాటంకంగా కొనసాగడానికి ఒక శుభ శకునం అవుతుంది. ఖమ్మం సభ తీరును బట్టి.. ఇతర ప్రాంతాల్లో కూడా బహిరంగసభలు నిర్వహించాలని తెలుగుదేశం భావిస్తోంది. ఏది ఎలాగైనా.. వచ్చే ఏడాదిలో జరిగేతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి.. గౌరవప్రదంగా కొన్ని సీట్లను దక్కించుకునే స్థాయికి పార్టీని బలపరచాలని నాయకులు భావిస్తున్నారు.

రాష్ర్ట విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొంత దెబ్బతింది. అందుకు రకరకాల కారణాలున్నాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన అనేకమంది నాయకులను కేసీఆర్ నయానా భయానా తన పార్టీలో చేర్చేసుకున్నారు. తెలుగుదేశంతో ఇక భవిష్యత్తు ఉండదు.. అని భయపెట్టి మరి ఆ పార్టీని ఖాళీ చేయించారు. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కూడా చాలా వరకు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ మీద అభిమానం ఉన్నా.. రాజకీయంగా బలంగా లేకపోవడంతో అలా సర్దుకున్నారు. 2018 ఎన్నికల తర్వాత పార్టీ మరింతగా దెబ్బతింది. అప్పటినుంచి రకరకాల ప్రయత్నాలు జరుగుతుండగా.. ఇప్పుడు పార్టీ కొత్త జవసత్వాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఖమ్మంలో జరిగే బహిరంగసభ కీలకం కానుంది. ఈ సభలో ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉంటాయా? అని పలువురు ఎదురు చూస్తున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ మాజీ తెలుగుదేశం నాయకులు పలువురితో ఇప్పటికే మంతనాలు పూర్తిచేశారని, వారు ఖమ్మం సభలో పార్టీలో చేరే అవకాశం ఉన్నదని ఒక వాదన వినిపిస్తోంది. ఈ బహిరంగ సభ వేదిక మీద.. కొంత మంది నాయకులనైనా పార్టీలో చేర్చుకుంటూ వారికి కండువా కప్పే వ్యవహారం ఉంటే.. పార్టీకి కొత్త జోష్ వస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. 

అదే సమయంలో.. అటు కాంగ్రెస్ లోను, ఇటు భారాసలోను ఇమడలేకపోతున్న మాజీ తెలుగుదేశం నాయకులు కొందరు కూడా తిరిగి మాతృసంస్థ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. వారు ఖమ్మంసభలోనే పార్టీలో చేరుతారా? లేదా? తెలియదు. అయితే ఖమ్మం సభ విజయవంతం అయ్యే తీరును బట్టి.. తెలుగుదేశం లోకి మరింత మంది చేరడానికి మొగ్గు చూపిస్తారని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి.. తెలుగుదేశం మరీ అస్తిత్వం లేని పార్టీ అనిపించుకోకుండా.. బలమైన పార్టీగానే బరిలో ఉండబోతున్నమాట వాస్తవం!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles