వినేవాడు వెర్రి వాడు అయితే అవతలివాడు ఎంత పెద్ద అబద్ధాలైనా బొంకగలడు. కానీ వినే వాడికి ఆలోచన ఉంటేనే అవతల వాడికి నష్టం. తెలుగుదేశం పార్టీ భిక్షతో రాజకీయ అరంగేట్రం చేసి, ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పంచన చేరి.. తనను గెలిపించిన పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. జగన్ పిలుపు ఇచ్చిన గడపగడపకు కార్యక్రమంలో భాగంగా తన గన్నవరంలో నియోజకవర్గంలో పర్యటిస్తున్న వల్లభనేని వంశీ.. చైతన్యం కలిగిన మహిళ మాటలకు షాక్ తిన్నారు. సమాధానం చెప్పలేక తడబడ్డారు. తమ చేతగానితనానికి అంతకంటే చేతగాని ముసుగులు తొడిగారు. నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా దిగజారి పోతుండడానికి, వెనక్కు పోతుండడానికి కారణం వాతావరణం అన్నట్లుగా ఒక సరికొత్త భాష్యం చెప్పారు.. వివరాల్లోకి వెళితే..
‘గడపగడపకు’ కార్యక్రమంలో భాగంగా వల్లభనేని వంశీ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భవాని అనే మహిళ ‘‘ఈ ప్రాంతంలో గతంలో విపరీతంగా ఐటి కంపెనీలు ఉండేవని తదనుగుణంగా అభివృద్ధి పరంగా ముందడుగు పడిందని.. ఇప్పుడు ఐటీ కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోవడంతో స్థానిక యువతరం కూడా ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని’’ అన్నారు సమాధానం చెప్పడం చేతకాని వల్లభనేని వంశీ, ‘నువ్వు ఈనాడు, ఆంధ్రజ్యోతి బాగా చదువుతున్నట్లు ఉన్నావు’ అంటూ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఎదిగి వచ్చింది కూడా ఆ పత్రికల వల్లనే కదా’ అంటూ మహిళ కూడా స్ట్రాంగ్ గానే సమాధానం చెప్పారు. అయితే ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ‘‘ఇక్కడ వాతావరణం ఇబ్బందికరంగా ఉంది గనుకనే ఐటీ కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోయాయని’’ అనడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది!
‘జగన్ సర్కారు వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న ఐటీ కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి’ అనే సంగతిని ప్రస్తుతానికి ఆయన పంచనే సేదతీరుతున్న ఎమ్మెల్యే వంశీ స్వయంగా ఒప్పుకున్నట్లు అయింది. కాకపోతే అందుకు వాతావరణం మీద నిపం మోపడం మాత్రం చిత్రంగా కనిపిస్తున్నది. వాతావరణం బాగా లేకపోవడం వలన ఐటీ కంపెనీలు ఇక్కడి నుంచి తరలిపోయేట్లయితే ఈ ప్రాంతం చరిత్రలో ఎప్పటికీ ఎదిగే అవకాశం లేదు కదా? మరి ప్రభుత్వం ఏం చేస్తూ కూర్చుంటుంది అనే సందేహం ప్రజల్లో వ్యక్తం అవుతున్నది. ‘వాతావరణం మీద సాకు చెప్పి అభివృద్ధి చేయకుండా మీనమేషాలు లెక్కించే ప్రభుత్వాలు ఎప్పటికీ ఏమీ చేయవు’ అనే సత్యాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు!
ఇవాళ గన్నవరం నుంచి వెళ్లిపోయిన ఐటీ కంపెనీల విషయంలో ‘‘వాతావరణం కారణం’’ అని ఒక కహానీ వినిపిస్తున్నారు! రేపు విశాఖకు రాజధాని తరలించినంత మాత్రాన– అక్కడకు ఐటీ కంపెనీలు, ఇతర కంపెనీలు వెల్లువలా వస్తాయనే గ్యారెంటీ ఏముంది? అభివృద్ధి పరంగా ఆ ప్రాంతం కూడా సర్వనాశనం అయిన తరువాత.. ‘‘గన్నవరం కంటే విశాఖపట్నం వాతావరణం ఇంకా ఘోరం.. అందుకే ఐటీ కంపెనీలు ఎవరూ రావడం లేదు’’ అని సాకులు చెబితే ప్రజలు ఏం చేయగలరు అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి!