ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా ఒక విషయం గురించి పదే పదే ప్రపంచాన్ని ఊదరగొడుతుంది. సినిమా విడుదల అయిన రోజునే ఆ సినిమాను ఇంట్లో టీవీలో చూసే అవకాశం రాష్ట్ర ప్రజలందరికీ కల్పిస్తున్నాం అంటూ దాని గురించి చాలా గొప్పలు చెప్పుకుంటూ వచ్చింది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రజల కోసం ఈ విప్లవాత్మకమైన విధానాన్ని తీసుకువస్తున్నదని గొప్పలు చెప్పుకున్నది. కానీ విశాఖలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత విషయం గమనిస్తే ఎక్కడ రిలీజు కావడానికి అవకాశం లేని, థియేటర్లకు గతిలేని సినిమాలు మాత్రమే ఈ పథకం ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అర్థమవుతోంది. పైగా ఈ సేవలను వారికి ఉచితంగా అందించడం లేదు. ప్రతి సినిమా విడుదల తేదీ నాడు 99 రూపాయల చందా చెల్లించి 24 గంటలలోగా ఆ సినిమాను చూడవలసి ఉంటుంది.
అంటే అటు థియేటర్లలో గాని ఇటు ఓటిటీ వేదికల మీద గాని ఎక్కడా ప్రదర్శనకు తగిన యోగ్యత లేని చెత్త సినిమాలను రాష్ట్ర ప్రజల మీద బలవంతంగా రుద్దడానికి తద్వారా చెత్త సినిమాలు రూపొందించే వారికి అయినకాడికి ప్రజల డబ్బు దోచిపెట్టడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకువచ్చినట్లుగా కనిపిస్తుంది. పెద్ద హీరోల చిత్రాలు కూడా ఈ రకంగా ప్రదర్శించేందుకు పెద్ద నిర్మాతలతో చర్చలు జరుగుతున్నామని ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పెద్దలు ప్రకటించారు కానీ అది సాధ్యమయ్యే సంగతి కాదు.
సినిమా థియేటర్లు కొందరి చేతుల్లో, గుత్తాధిపత్యంలో ఉన్నాయని ఆ నేపథ్యంలో అసలు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని అందువల్ల ప్రజలకోసం ఇలాంటి సత్కార్యం చేస్తున్నామని అన్నట్లుగా మంత్రి గుడివాడ అమర్నాధ్ దీని గురించి చెప్పుకొచ్చారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ద్వారా ఈ చిత్రాల ప్రదర్శన ఉంటుంది.
కానీ ఈ వాదనలో వాస్తవం కొంత మాత్రమే. ఓటీటీ వేదికలు రావడానికి పూర్వం ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు థియేటర్ లో విడుదల అయి సూపర్ హిట్ కాగల స్థాయిలేని ఒక మోస్తరు చిత్రాలు కూడా.. ఓటీటీలో డైరక్టుగా ప్రజల ముందుకు వచ్చేస్తున్నాయి. ఓటీటీ వేదికల సంఖ్య కూడా పెరిగింది. వారు మంచి మొత్తాలనే మేకర్స్ కు ముట్టజెబుతున్నారు. ఓటీటీ వేదికలు కూడా తిరస్కరించాయంటే.. ఆ సినిమాలు మరీ చెత్త అని అనుకోవాలి. ఏపీ సర్కారు తెచ్చిన కొత్త పథకం.. ఫైబర్ నెట్ లిమిటెడ్ ద్వారా విడుదలయ్యే సినిమాలు అన్నీ ఆ స్థాయి చిత్రాలు మాత్రమే అని పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు.
చెత్త సినిమాలను జనం మీద రుద్దే ప్రయత్నం
Monday, December 23, 2024