శవరాజకీయాలకు ఇది పరాకాష్ట ఘట్టాల్లో ఒకటి. ఒకవైపు నందమూరి తారకరత్న మరణంతో ఆ కుటుంబం మొత్తం తల్లడిల్లుతూ ఉంటే.. తగుదునమ్మా అంటూ తలదూర్చ, ఆ చావులోంచి.. రాజకీయ ప్రయోజనాలను పిండుకోవాలని చూడడం అత్యంత హేయం, నీచం! అధికారపార్టీ చేస్తున్న ఇలాంటి అసహ్యమైన ప్రయత్నానికి ఈసారి లక్ష్మీపార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ చేతిలో చిలకలాగా దొరకడం గమనార్హం. తన మాటలు వింటున్న వారు.. తనని సైతం అసహ్యించుకుంటారనే వెరపు లేకుండా ఆమె.. నందమూరి ఇంట విషాదాన్ని చంద్రబాబునాయుడుపై బురద చల్లడానికి అవకాశంగా వాడుకోవడం అనేది జుగుప్సాకరంగా ఉంది.
నందమూరి తారకరత్న గుండెపోటుతో నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి దుర్మరణం చెందారు. అయితే ఈ మరణాన్ని నారా లోకేష్ కు ముడిపెట్టడానికి లక్ష్మీపార్వతి ప్రయత్నిస్తున్నారు. ఇంతకూ ఆమె ఏం చెబుతున్నారంటే..
నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజున.. ఆ కార్యక్రమంలోనే గుండెపోటుకు గురైన తారకరత్న ఆనాడే చనిపోయారట. అయితే ఆ అబ్బాయిని యాతన పెట్టి.. ఇన్నాళ్లూ చావును ధ్రువీకరించకుండా ఆపారట. ఆరోజే చనిపోయారని వెల్లడిస్తే.. నారా లోకేష్ పాదయాత్ర మీద మచ్చలా నిలిచిపోతుందని భయపడ్డారట. నారా చంద్రబాబునాయుడు ఇలాంటి స్కెచ్ వేశారట.
రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వివిధ పరిణామాలకు ఎక్కడెక్కడి వ్యవహారాలకో లింకులు కలిపి నీచమైన వ్యాఖ్యానాలు చేయడం అందరికీ అలవాటే. అయితే వాటిలో కూడా కొంత మంచీ చెడూ విచక్షణ ఉండాలి. చావును కూడా వాడుకోవడమా? లేదా? అనే విజ్ఞత ఉండాలి. సాధారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఆఫీసు కోటరీలో తయారయ్యే స్క్రిప్టులు ఎంచుకోబడిన నాయకులకు అందుతాయని వాటిని వారు జస్ట్ ప్రెస్ మీట్ లో వల్లెవేస్తారని అందరూ అంటూఉంటారు. ఇది వింతేమీ కాదు.
ఇక్కడ జరిగిన ఘోరం నందమూరి కుటుంబానికి సంబంధించినది అయ్యేసరికి.. పార్టీ వ్యూహాత్మకంగా లక్ష్మీపార్వతిని ప్రయోగించింది. ఆమె తెరమీదకు వచ్చి.. ఈ చావును లోకేష్ యాత్రతో ముడిపెడుతోంది. చంద్రబాబు కుట్ర అంటోంది. ఎన్నడో చనిపోతే.. ఇప్పుడు ప్రకటించారంటోంది. లక్ష్మీపార్వతి చెబుతున్నది నిజమైతే.. 23రోజులు మరణాన్ని ధ్రువీకరించకుండా ఆపారన్నమాట. ఇది మరీ చోద్యం. ఇదంతా పార్టీ ఇచ్చిన స్క్రిప్టు చదివే చిలక పలుకులు మాత్రమే అనడంలో సందేహం లేదు.
నందమూరి తారకరత్న బెంగుళూరు ఆస్పత్రిలో ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారని ఆయన స్వయంగా బెంగుళూరులో మీడియాకు వెల్లడించారు. లక్ష్మీపార్వతి చెప్పిన మాటలు నిజమైతే.. ఆనాడు విజయసాయిరెడ్డి మాటలు అబద్ధం కావాలి. ఆయన నిజమైతే.. లక్ష్మీపార్వతి మాటలు చిలకపలుకులు అనుకోవాలి. ఇలాంటి మాటలతో తనపట్ల ప్రజల్లో అసహ్యం పేరుకుంటుందని ఆమె తెలుసుకోవాలి.
చిలకలాగా పలుకుతున్న లక్ష్మీపార్వతి!
Thursday, December 19, 2024