చిన కోమటిరెడ్డి.. కప్పల తక్కెడ యవ్వారమేనా!

Wednesday, January 22, 2025

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అంతో ఇంతో సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు కప్పల తక్కెడ వ్యవహారం లాగా ఉంది. తక్కెడలో కప్పలను వేస్తే ఆ తూకం ఎప్పటికైనా ఎలా తెగుతుంది? కప్పలు నిత్యం ఇటు నుంచి అటు- అటు నుంచి ఇటు గెంతుతూనే కదా ఉంటాయి. ఆ కప్పల తక్కెడ వ్యవహారం లాగానే కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా మళ్లీ మళ్లీ ఇటు నుంచి అటు- అటు నుంచి ఇటు గెంతుతున్నారా అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ తొలుత ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోని స్థానిక నాయకులతో విభేదాలు వచ్చిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా మధ్యలో కాంగ్రెస్ ను వీడి కేసీఆర్ పంచన చేరాలని భావించినట్లుగా కూడా అప్పట్లో పుకార్లు వచ్చాయి. కానీ అవేమీ వర్కవుట్ కాలేదు.

సుదీర్ఘకాలం పాటు బిజెపిలో చేరుతారేమో అనే అనుమానాలను ప్రజల్లోకి వదిలి.. సాగదీస్తూ వచ్చిన రాజగోపాల్ ఇటీవల కాలంలో మునుగోడు ఎమ్మెల్యేగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. తత్ఫలితంగా మునుగోడులో అనివార్యంగా వచ్చిన ఉప ఎన్నికల్లో, భారతీయ జనతా పార్టీ తరఫున బరిలోకి దిగారు. ఈ ఎన్నికలలో కొన్ని వందల కోట్ల రూపాయల ధన ప్రవాహం విచ్చలవిడిగా ఓటర్లను ముంచెత్తిందని పుకార్లు వినిపించాయి. ఏది ఏమైనప్పటికీ సిటింగ్ ఎమ్మెల్యేగా ఇక్కడ రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికలు ఎదుర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ కు భంగపాటు తప్పలేదు. ఆ ఓటమి తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో సైలెంట్ గానే ఉండిపోయారు. కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనకుండా ఉంటున్నారు.

తీరా ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారని ప్రచారం బాగా జరుగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిస్తున్నట్టుగా కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బాగా పుంజుకుందని, బిజెపి ఆ సంగతి గుర్తించాలని కోమటిరెడ్డి అంటున్నారు. అన్న వెంకటరెడ్డి ఎటూ కాంగ్రెస్ ను వదలకుండా అక్కడ పిసిసి రేవంత్ తో కూడా సయోధ్యకుదురుచుకుని కీలకంగా చక్రం తిప్పుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నా కూడా ఆశ్చర్యం ఎంత మాత్రం లేదు అని పలువురు విశ్లేషిస్తున్నారు. శనివారం రాత్రి సమయానికి ఢిల్లీలో ఈటలతో కలిసి పార్టీ నాయకులు సంతోష్ కుమార్, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రేపటికి ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టం అని పలువురు అంటున్నారు. ఆయన మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తే మాత్రం కప్పలు తక్కెడ సామెత తప్పకుండా గుర్తుకు వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles