చిన్నమ్మ పై మండిపడుతున్న వైసిపి దళాలు!!

Friday, December 27, 2024

భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ కొత్తగా సారథిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ దళాలు మండిపడుతున్నాయి. ఆమెను బదనాం చేయడానికి ఆమె క్రెడిబిలిటీని దెబ్బ కొట్టడానికి రకరకాల వ్యూహరచనలో ఉన్నాయి. ఆమె తీరు తాము కోరుకున్నీరీతిగా లేకపోయేసరికి కంగారుపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోము వీర్రాజును పదవి నుంచి తప్పించి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించిన తర్వాత మురిసిపోయిన వారిలో వైసిపి నాయకులు కూడా ఉన్నారు. పాత చరిత్రను మనసులో పెట్టుకుని, చంద్రబాబు నాయుడుతో ఉన్న విభేదాలను గుర్తుపెట్టుకుని దగ్గుబాటి పురందేశ్వరి తెలుగు దేశాన్ని ఓడించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని తద్వారా తమకు లాభం చేకూరుతుందని వారు కలగన్నారు. కానీ పురందేశ్వరి వ్యవహార సరళి వారు కోరుకున్నట్లుగా లేదు.

చంద్రబాబుతో తమ బిజెపి స్నేహబంధం విషయంలో ఆచితూచి మాట్లాడుతున్న దగ్గుబాటి పురందేశ్వరి, వైసీపీ ప్రభుత్వం మీద మాత్రం ఎడతెగకుండా విమర్శలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ లోపాలను, జగన్ పరిపాలన వైఫల్యాలను ఎండగట్టడంలో ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడును నిందిస్తున్నది కూడా లేదు. ఈ పరిణామాలను ఊహించలేని వైసీపీ నాయకులకు పురందేశ్వరి వ్యవహారం కంటగింపుగా మారుతోంది.

పురందేశ్వరి సారథ్యం స్వీకరించిన తర్వాత.. సాక్షిలో కొన్ని ప్రత్యేక  కథనాలు కూడా అందించారు. చిన్నమ్మా.. తమరు టార్గెట్ చేయాల్సింది మీ మరిది చంద్రబాబును, జగన్ ప్రభుత్వాన్ని కాదు.. అంటూ పురందేశ్వరికే సాక్షి కథనాల ద్వారా.. రూట్ మ్యాప్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆమె పనిచేయాల్సిన ఎజెండాను సాక్షి కార్యాలయంలో రూపొందించాలని అనుకున్నారు. కానీ ఆ పప్పులేమీ ఉడకలేదు. పురందేశ్వరి మాత్రం వారి మైండ్ గేమ్ కు లొంగకుండా.. జగన్ సర్కారు మీదనే దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నేరుగా భాజపా తిట్టడానికి వారికి ధైర్యం చాలదు.. అలాగని పురందేశ్వరి విమర్శలను సహించలేకపోతున్నారు.

పార్టీలో ఆమె క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి ఏం చేయాలా అనే కసరత్తులో కిందా మీదా అవుతున్నారు. రాజకీయ వాతావరణం చూస్తే భారతీయ జనతా పార్టీ సహా విపక్షాలు అన్నీ ఏకమవుతాయనే వారికి అనిపిస్తోంది. అదే అధికార పార్టీలో భయం పెంచుతోంది.  ముందు ముందు వారు ఎలా నెట్టుకొస్తారో పురందేశ్వరి పట్ల ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles