చిత్రమైన మెలికలు పెడుతున్న జగన్ సర్కార్

Wednesday, January 22, 2025

అమరావతి రాజధాని ప్రాంతంలో 55 వేల మంది పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో ఇళ్లను నిర్మించి ఇచ్చే ందుకు ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో ఆర్5 జోన్ లో పేదలకు పట్టాలు ఇవ్వడం గురించి హైకోర్టు తుది నిర్ణయం వెలువరించే వరకు ఇళ్ల నిర్మాణాన్ని ఆపుదల చేయాలన్న రైతుల విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  సుప్రీంకోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకొని అమరావతి ప్రాంత రైతుల అభ్యంతరాలు అన్నింటిని అడుగంటా తొక్కేసి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది జగన్ ప్రభుత్వం. అయితే ఆ స్థలాలలో ఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా వాళ్లకు గ్రీన్ సిగ్నల్ దొరకడం లేదు. ఈ విషయంలో హైకోర్టు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారు.

అమరావతి ప్రాంతంలో ఇచ్చిన స్థలాలలో ఇళ్ల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఉందా అని హైకోర్టు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వ న్యాయవాది తడబడడం జరుగుతోంది. సుప్రీంకోర్టు అనుమతితోనే తాము స్థలాలను పంపిణీ చేసినట్లుగా ప్రభుత్వ న్యాయవాది చెబుతున్నారు. అంతేతప్ప అక్కడ ఇళ్ల నిర్మాణానికి సుప్రీం అనుమతించిందనే సంగతి చెప్పడం లేదు.

ఒకవేళ పట్టాల విషయంలో హైకోర్టు తుది తీర్పు పట్టాల కేటాయింపులకు వ్యతిరేకంగా వస్తే గనుక ఆయా పేదలందరికీ వేరువేరు ప్రాంతాల్లో మళ్లీ భూ కేటాయింపులు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాదే సెలవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో హైకోర్టు తుదితీర్పు వచ్చే వరకు వేచిఉండే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత తుదితీర్పు వ్యతిరేకంగా వస్తే, అప్పటిదాకా పెట్టిన ఖర్చు వృథా అవుతుంది కదా అని కోర్టు ప్రశ్నించినప్పుడు.. అలాంటి పరిస్థితి వస్తే.. ఆ స్థలాలకు తగిన ఇతర స్థలాలను సీఆర్డీయే కు మరోచోట కేటాయిస్తామని ప్రభుత్వం తమాషా వాదన వినిపిస్తోంది.

అమరావతి మాస్టర్ ప్లాన్ స్వరూప స్వభావాలను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి నిజంగానే పేదలకు ఉపయోగపడేలా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఉంటే, వారిని మరిన్ని వివాదాల్లోకి నెట్టేయాలనే దుర్బుద్ధి లేకుండా ఉంటే.. కోర్టు నుంచి తుది తీర్పు వచ్చే దాకా ఆగవచ్చు కదా అని పలువురు విమర్శిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles