చంద్రయాన్ 3 సరే.. చంద్రశేఖర్ యాన్ 3 సంగతేంటి?

Wednesday, January 22, 2025

ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం లో మూడు నెలల ముందుగానే ఎంఎల్ఏ అభ్యర్థులను ప్రకటించి, తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన చంద్రశేఖర్ యాన్ – 3 (మూడో సారి అధికారం చేపట్టడం) సక్సెస్ అవుతుందా లేదా అనే చర్చ సమాంతరంగా నడుస్తోంది.

గత రెండు ఎన్నికల మాదిరే ఈ సారి కూడా కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థులు ను ప్రకటించారు. అయితే ఈ అభ్యర్థుల ప్రకటన పై చెప్పుకోదగిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నా, కేసీఆర్ తనదైన మంత్రాంగంతో సమస్యలను ప్రస్తుతానికి పరిష్కారం చేయగలిగారనే భావించవచ్చు. సీటు రాని సిటింగ్ ఎంఎల్ఏ లలో ఒక్క ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తప్ప ఇప్పటి వరకు ఎవ్వరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. సీట్లు వచ్చిన వారిలో మైనంపల్లి హన్మంతరావు తిరుగుబాటు సరేసరి. దీనినిబట్టి చూస్తే పార్టీ పరంగా కేసీఆర్ విజయవంతం అయినట్లే కనిపిస్తోంది.

ఇక రాబోయే తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనా కు వస్తే,   ప్రస్తుతానికి కేసీఆర్ ముందంజలో ఉన్నారు. ఎంఎల్సీ, కేసీఆర్ బిడ్డ కవిత మీద ఉన్న లిక్కర్ కేసు లైమ్ లైట్ లో లేకపోవడం, బండి సంజయ్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించి, కిషన్ రెడ్డి కి ఆ పదవి ఇవ్వడం తోనే, అప్పటి వరకు బిఆర్ఎస్ కు ప్రధాన పోటీ దారుగా ఉన్న బిజెపి రేసు లో వెనుక పడిపోయిందని అందరూ అనుకుంటున్నారు. దీనికి కేసీఆర్, బిజెపి తో మిలాఖత్ అవడం అనే కాంగ్రెస్ ఆరోపణ కంటే, కేసీఆర్ వ్యూహ చతురత గానే మనం చూడాల్సి ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ తీసిన కేసీఆర్ కి మూడో సారి ఆ పార్టీ ని దెబ్బ తీయడం పెద్ద కష్టం కాబోదని బిఆర్ఎస్ నాయకుల అంచనా.

 చంద్రయాన్ 3 లో సక్సెస్ ఫుల్ గా విక్రమ్ రోవర్ చంద్రుని మీద తిష్ట వేసినట్లు, చంద్రశేఖర్ యాన్ 3 లో కూడా బిఆర్ఎస్ కారు అధికారం లోకి రావొచ్చనేది ప్రస్తుతానికి ఉన్న అంచనా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. నేటితో ఆ గడువు కూడా ముగుస్తుంది. 119 స్థానాలకు ఇప్పటికే 800 వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వారిలో గెలుపుగుర్రాలను అన్వేషించి మోహరించడంలో కాంగ్రెస్ ఏ మేరకు సక్సెస్ కాగలదనే దానిని బట్టి.. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిదో తేలుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles