రాజకీయ పార్టీలు ఎక్కడ సభ నిర్వహించుకోవచ్చు అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన విధివిధానాలు విమర్శలకు గురవుతున్నాయి. ఈ చీకటి జీవో ప్రజల ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్నదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రసాదించే భావప్రకటన స్వేచ్ఛకు దెబ్బ అని పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు సభల్లో జరిగిన దుర్ఘటనలను సాకుగాచూపిస్తూ ఈ జీవో తెచ్చిన సర్కారు ప్రధానంగా పవన్ కల్యాణ్ భవిష్యత్ కార్యచరణ ప్రణాళికపై దెబ్బకొట్టడానికి చూస్తున్నదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
ప్రభుత్వం మీద ప్రజల నిరసన, అసంతృప్తి వ్యక్తం కావడంలో చంద్రబాబు నిర్వహిస్తున్ ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభలు చాలా చిన్నవి. ముందుముందు ఇంకా తీవ్రమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. మరింత వెల్లువగా ప్రజాగ్రహం బయటపడనుంది. పవన్ కల్యాణ్ నారా లోకేష్ ఈ నెలాఖరులో పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ యాత్రలో ప్రతిరోజూ కొన్ని ఊర్లలో రోడ్ షోలు, సభలు ఉంటాయి. అయితే ఆయన పాదయాత్రగా నడుస్తుంటారు గనుక.. తన మార్గానికి సమీపంలో ఉండేచోట్లే సభలు పెట్టడానికి చూస్తారు. అదే రీతిగా పవన్ కల్యాణ్ కూడా త్వరలో వారాహి వాహనం అధిరోహించి రాష్ట్రమంతా పర్యటించాలని చూస్తున్నారు. ఆయన ఏకంగా తన వాహనమే సభావేదికగా కూడా ఉపయోగపడేలాగా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. అంటే వాహనం వెళుతున్న మార్గంలోనే అక్కడక్కడా ఆపి అక్కడికక్కడ సభలు నిర్వహిస్తారన్నమాట. పవన్ ఏ సమయంలో ఏ సెంటర్లో నిలబడి గొంతు సవరించుకున్నా సరే.. కొన్ని నిమిషాల వ్యవధిలో వేల మంది జనం అక్కడ పోగవుతారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ సభలు విజయవంతం కాకుండా ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ జీవో తెచ్చినట్టుగా కనిపిస్తోంది.
రాష్ట్రమంతా యాత్ర చేస్తూన్నప్పుడు ప్రతిచోటా విడివిడిగా సభా స్థలాలను ఎంపిక చేసుకోవడం, ప్రభుత్వ జీవోలో పేర్కొన్నట్టుగా ఊరు బయట ఉండే స్థలాలను చూసుకుని అక్కడ సభలు పెట్టడం అనేది ప్రాక్టికల్ గా పవన్ వారాహి యాత్రకైనా, లోకేష్ పాదయాత్రకైనా సాధ్యం కాదు. ఈ జీవో నిబంధనలను అతిక్రమించి వారు కార్యక్రమాలు నిర్వహించడం అనేది అనుకోకుండానే జరిగిపోతుంటుంది. అప్పుడిక ఈ జీవో సాకుగా చూపి వారి కార్యక్రమాలను అడ్డుకోవడం, విఘ్నాలు కలిగించడం, వారి మీద- స్థానికంగా వారి కార్యక్రమాల ఏర్పాట్లు చూసే నాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం వంటివి ప్రభుత్వానికి చాలా సులభం అయిపోతాయి. అలాంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఈ జీవో తెచ్చినట్లుగా చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో ఖండించినట్లుగా.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనల మేరకు అనుమతులు ఇస్తారు.. అంటే దాని అర్థం కేవలం వైసీపీ నాయకులకు మాత్రం అనుమతులు ఇస్తారనేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.