ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాష్ట్రంలో రాజుకుంటున్న తరుణంలో చంద్రబాబునాయుడు ఒక మంచి లాజిక్ తెరమీదకు తెచ్చారు.అసలు శాసనమండలి అన్నదే ఉండడానికి వీల్లేదని, దానిని తక్షణం రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం జగన్‌కు .. ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందా? అని చంద్రబాబు అంటున్నారు. చాలా సబబుగా కనిపించే లాజిక్ ఇది. పట్టభద్రులు అంటేనే.. కాస్త చదువరులు, ఆలోచనాపరులు, విజ్ఞులు అయిన ఓటర్లు జాగ్రత్తగా ఆలోచిస్తే గనుక.. జగన్ కు నష్టం చేయగల లాజిక్ ఇది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానుల గొడవను తెరమీదికి తెచ్చారు. అంతా నా ఇష్టం అన్నట్టుగా ఆ బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించి, రాజధాని మార్చేయాలని అనుకున్నారు. అప్పటికి శాసనమండలిలో వైసీపీకి పూర్తి మెజారిటీ లేదు. అసెంబ్లీ గడప దాటిన మూడురాజధానుల బిల్లు, మండలి వద్ద చతికిలపడింది. అప్పటి మండలి ఛైర్మన్ మీద రకరకాల ఆరోపణల ద్వారా విరుచుకుపడుతూ, మైండ్ గేమ్ అడి, ఆయనను డిఫెన్సులో పడేసి అయినా బిల్లును నెగ్గించుకోవాలని జగన్ అండ్ కో శతవిధాల ప్రయత్నించింది. అయితే పటిష్టమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాలేదు. కౌన్సిల్ ను దాటి వెళ్లలేకపోయింది.
తన మాట నెగ్గలేదని ఆగ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఏకంగా కౌన్సిల్ అన్నదే ఉండడానికి వీల్లేదని అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసేశారు. ముందు వెనుకలు చూసుకోకుండా, తన నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చేస్తుందా? లేదా, ఇంకో దశ దాటాల్సి ఉంటుందా? లాంటి టెక్నికాలిటీస్ ఏమీ పట్టించుకోకుండా జగన్ రెచ్చిపోయి నిర్ణయం తీసుకున్నారు. మండలిని రద్దుచేయాలన్న ఆయన కోరిక కూడా అటకెక్కిపోయింది.
ఆ తర్వాత కొన్నాళ్లకు మండలిలో కూడా తన పార్టీకి మెజారిటీ వచ్చేసరికి జగన్ చాలా కన్వీనియెంట్ గా ఆ విషయం మర్చిపోయారు.
చంద్రబాబు ఇప్పుడు అదే అంశం గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు మండలిని రద్దు చేయాలని ప్రయత్నించిన వ్యక్తి.. ఇవాళ ఏ మొహం పెట్టుకుని తన పార్టీ వారిని మండలికి పంపడానికి ఓట్లు అడగగలరని ఆయన అంటున్నారు. ఈ లాజిక్ ప్రజలకు అర్థమైతే ఫలితం ఇంకో రకంగా ఉంటుంది.
శాసనమండలి అంటేనే పెద్దల సభ అంటారు. ఆలోచనపరులు, వివేకులు ఉండే సభగా దానికి ముద్ర ఉంది. జగన్ ఆ పెద్దల సభకు విజ్ఞత ఉంటే అది ఉండడానికే వీల్లేదని, తన అనుచరులు, తొత్తులతో నిండిపోయి ఉంటే కొనసాగవచ్చునని అభిప్రాయపడే ధోరణి అవలంబిస్తున్నారనేది ప్రజల ఆలోచన. రాజకీయ నిరాశ్రయులకు అక్కడ చోటు ఇస్తున్నారనేది వారి భావన. అలాంటప్పుడు.. జగన్ తన అవసరాలకు మండలి అనే గౌరవాన్ని వాడుకుంటున్నారే తప్ప.. ఆ వ్యవస్థపై గౌరవం ఉండి కాదని ప్రజలకు బోధపడితే.. వైసీపీ ఎన్నికల్లో దెబ్బతింటుంది.
చంద్రబాబు లాజిక్ జగన్‌కు చేటు చేస్తుందా?
Wednesday, January 22, 2025