రాజకీయం చేయడం అంటేనే మాటలను వక్రీకరించడం. ఈ సిద్ధాంతాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తిరిగి దృష్టి కేంద్రీకరిస్తూ ఉండేసరికి తెలంగాణలో ఆ పార్టీ మళ్లీ ఎక్కడ తిరిగి ప్రజాదరణ పొందుతుందో అనే భయం టిఆర్ఎస్ నాయకులను వెంటాడుతున్నట్లుగా ఉంది. అందుకే వారు చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే, ఆయన మాటలకు సంకుచిత భాష్యాలు చెబుతూ వక్ర బుద్ధితో విమర్శలు చేస్తున్నారు.
ఇంతకు ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ చేసిన సేవలను కూడా గుర్తుచేశారు.సంక్షేమం అంటే ఏమిటో మొదట ఎన్ టి రామారావు చూపించారని.. రెండురూపాయలకు కిలోబియ్యం పథకం తేవడం ద్వారా.. రాష్ట్ర ప్రజలకు ఆహార భద్రత కల్పించారని ఆయన అన్నారు. ఇది చాలా సాధారణమైన మాట. ఆహారభద్రత కల్పించారని అనడం తప్పేమీ కాదు.
అక్కడికేదో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబునాయుడు చాలా అవమానించేలా మాట్లాడినట్టుగా భారాస నాయకులు కొందరు రెచ్చిపోతున్నారు. ఆ పార్టీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటున్నారు. ఆయన చంద్రబాబు మాటలకు వక్రభాష్యాలు తీస్తున్నారు. ఎన్ టిఆర్ తెలంగాణ ప్రజలకు అన్నం తినడం నేర్పారని అన్నట్టుగా వక్రీకరించి.. దానికి ప్రతివిమర్శలు చేస్తూ చంద్రబాబును తిట్టిపోస్తున్నారు.
చంద్రబాబునాయుడు చరిత్ర తెలుసుకోవాలని.. 11వ శతాబ్దంలోనే తెలంగాణ ప్రాంతంలో వరి, గోధుమ పండేవని నానా లెక్కలు ఉదాహరణలు చెబుతున్నారు. ఇదంతా కేవలం వక్రీకరణ ను ఆధారం చేసుకుని చేస్తున్న విమర్శలు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణ మీద కూడా శ్రద్ధ పెడుతోంది. ఖమ్మం సభ తర్వాత.. మార్చి నెలాఖరులో పెరేడ్ గ్రౌండ్స్ లో కూడా భారీ సభ నిర్వహిస్తున్నారు. ఇదంతా భారాసకు కంగారు పుట్టించే వ్యవహారం.
వాళ్లు ఒకవైపు దేశమంతా విస్తరించాలని మాట్లాడుతూ..ఇప్పుడుచంద్రబాబు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తే.. ఆంధ్రోళ్లు ఎందుకు వచ్చారని ఇదివరకటిలాగా నిందలు వేయలేరు. అందుకే చంద్రబాబు మాటలకు వక్రభాష్యాలు తీసి ఆయన పట్ల ప్రజల్లో విముఖత పెంచడానికి పాట్లు పడుతున్నారని అనిపిస్తోంది.
చంద్రబాబు మాటలపై అర్థంలేని రాద్ధాంతం!
Sunday, January 19, 2025