‘‘ఒక్కసారి బ్లాక్ క్యాట్ కమెండోలను తొలగిస్తే చాలు చంద్రబాబునాయుడు ఫినిష్ అయిపోతారు..’’ ఏ ఉగ్రవాద సంస్థనో తమ దొంగచాటు వ్యూహరచనలుసాగించే సమయంలో, ఇలాంటి కామెంట్ చేస్తే వాళ్లు అందుకు ఎదురు చూడడం మామూలే కదా అనుకోవచ్చు. కానీ.. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం బహిరంగ సభా ముఖంగా ఇలాంటి మాట అనడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం, సంచలనం అవుతోంది.
తమ్మినేని సీతారాం అంతటితో ఊరుకోలేదు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుగా తనకున్న అధికారాల్ని ఉపయోగించి, చంద్రబాబుకు ఉన్న బ్లాక్ క్యాట్ కమెండోలను తొలగించాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి కూడా లేఖ రాస్తానని సెలవిచ్చారు. ఇది ఇంకా తీవ్రమైన వ్యాఖ్య! చంద్రబాబుకు ఉన్న ఏపీ పోలీసుల భద్రతను జగన్ సర్కారు బాగా కుదించింది. అదే సమయంలో కేంద్రం కల్పిస్తున్న భద్రత తగ్గించేందుకు ప్రయత్నిస్తామంటున్నారు. ఆ భద్రత లేకపోతే ఆయన ఫినిష్ అయిపోతారనీ అంటున్నారు. అంటే.. తాను కేంద్రానికి లేఖరాసి.. చంద్రబాబును ఫినిష్ చేయడానికి అనువైన వాతావరణం సృష్టించాలని స్పీకరు తమ్మినేని ప్రయత్నిస్తున్నారా? అనేది ప్రజల సందేహం. ఈ విషయంలోనే టీడీపీ అలర్ట్ అవుతోంది.
ఈ మేరకు, చంద్రబాబు హత్యకు కుట్ర జరుగుతోందని, తమ్మినేని వ్యాఖ్యల నేపథ్యంలో కుట్ర కేసు నమోదు చేయాలని, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. ఏపీ డీజీపీ తెలుగుదేశం వారి విన్నపాల పట్ల ఎలా స్పందిస్తారో అందరికీ తెలిసిన సంగతే. అందుకే టీడీపీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ్మినేని వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబుకు పొంచి ఉన్న ప్రమాదం గురించి కేంద్రానికి కూడా లేఖ రాయబోతోంది. కేంద్రం కల్పించే భద్రత ఏర్పాటు.. బ్లాక్ క్యాట్స్ ను లేకుండా చేయడానికి జగన్ సర్కారు కుట్ర చేయబోతున్నదంటూ తెలుగుదేశం ముందుగా కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రపతికి లేఖలు రాయాలని, తమ్మినేని సీతారాం వ్యాఖ్యల వీడియోలను కూడా జతచేసి పంపాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ఫినిష్ అయిపోతారనే తమ్మినేని వ్యాఖ్యలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎక్కువ ఇరుకున పెట్టేలా కనిపిస్తున్నాయి. ముందుముందు చంద్రబాబు పాల్గొనే సభాకార్యక్రమాలకు కూడా కేంద్రభద్రతను అడిగే ప్రయత్నం కూడా టీడీపీ చేయాలనుకుంటోంది. గతంలో ఏపీ పోలీసులు భద్రత వైఫల్యాలతో చంద్రబాబు మీద చెదురుమదురు దాడులు జరిగిన వైనం కూడా కేంద్రానికి చేసే ఫిర్యాదులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది.
‘చంద్రబాబు ఫినిష్’.. అలర్ట్ అవుతున్న టీడీపీ!
Saturday, December 21, 2024