చంద్రబాబునాయుడు మహానాడు సందర్భంగా ప్రకటించిన తొలి మేనిఫెస్టో రూపంలోనే అనేక జనాకర్షక పథకాలను ప్రకటించారు. వాటికి ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది కూడా. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, 18ఏళ్లు వయసు దాటిన ప్రతి మహళకూ ప్రతినెలా 1500 ఇవ్వడం వంటి పథకాలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఆ తొలి మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంలోనే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని కూడా చంద్రబాబు అన్నారు. ఆ విషయం నిజమే అన్నట్టుగా.. తన అమ్ముల పొదిలోంచి.. ఒక్కొక్క అస్త్రాన్ని ఆయన నెమ్మదిగా బయటకు తీస్తున్నట్టుగా ఉంది. రాష్ట్రంలోని 125 నియోజకవర్గాలను కవర్ చేయడానికి సోమవారం నాడు బస్సుయాత్రను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మరో కీలక హామీని ప్రకటించారు. రాష్ట్రప్రజల మీద విద్యుత్తు చార్జీల భారం తగ్గిస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందే అంశం విద్యుత్తు చార్జీల తగ్గింపు. ఇది ఖచ్చితంగా ప్రజల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
చంద్రబాబునాయుడు సాధారణంగా విద్యుత్తు చార్జీల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. విద్యుత్తు రంగం మీద, ఆ రంగంలో ఏమైనా చిన్న తేడా వస్తే.. ఆర్థిక వ్యవస్థ ఎంతగా కుదేలవుతుందనే అంశం మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉంది. విద్యుత్తు రంగంలో తాయిలాలను ఆయన తొలుత ఒప్పుకునేవారు కాదు. 2004 ఎన్నికల సమయంలో.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అనే కీలకమైన హామీతో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మీద వశీకరణ మంత్రం ప్రయోగించినప్పుడు.. చంద్రబాబునాయుడు దానిని వ్యతిరేకించారు. ఆ విదంగా ఉచిత విద్యుత్తు లాంటివి ఇవ్వడం వల్ల.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం ఉంటుందని, అది తప్పు అని ఆయన భావించారు. పార్టీ సన్నిహితులు, వ్యూహకర్తలు ఆయనకు ఉచిత విద్యుత్తు హామీ మనం కూడా ఇద్దాం అని చెప్పినా ఒప్పుకోలేదు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తర్వాత రాష్ట్రంలో అనివార్యంగా ఉచితవిద్యుత్తు కొనసాగుతూ వస్తోంది.
జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత.. విద్యుత్తు చార్జీల రూపేణా అనేక రకాలుగా వడ్డనలు సాగిస్తోంది. తెలియకుండానే ప్రజలపై భారం మోపుతోంది. ప్రజల్లో సర్కారు పట్ల విద్యుత్తు వడ్డింపులు విముఖత పెంచుతున్నాయి. అనేక దఫాలుగా ఇప్పటికే విద్యుత్తు చార్జీలు పెరిగాయి. సరిగ్గా ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న ఈ అంశాన్నే చంద్రబాబునాయుడు పట్టుకున్నారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీల భారం తగ్గిస్తాం అని ఆయన ప్రకటించడం ఇప్పుడు ప్రజల మీద సమ్మోహక అస్త్రంగా పనిచేయనుంది. తెలుగుదేశం పార్టీకి ఈ హామీ సానుకూల సంకేతాలను సృష్టించగలదని అంతా అనుకుంటున్నారు.