తెలంగాణ తెలుగుదేశంపై చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కీలక నాయకులు అనేకమంది పార్టీని వీడిపోగా.. కార్యకర్తలే తమ అసలు బలం అని తొలినుంచి విశ్వసించే తెలుగుదేశం అధినేత తెలంగాణలో తిరిగి పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంలో మార్పు.. పార్టీని తిరిగి ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఎక్కువగా ఉపయోగపడగలదనే నమ్మకంతో ఉన్నారు.
రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతింది. విభజనకు తాము వ్యతిరేకం కాదు అనే స్పష్టమైన సిద్ధాంతంతోనే పార్టీ వ్యవహరించినప్పటికీ.. వారిమీద అనుమానాలు పుట్టించే ప్రత్యర్థి ప్రచారాల వల్ల.. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలిచింది. అయితే తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. మాయోపాయంతో గెలిచిన ఎమ్మెల్యేల్లో పలువురిని ఫిరాయింపజేసి తమ పార్టీలో చేర్చుకున్నారు. వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు.
తెలుగుదేశంలో తనకున్న పూర్వపరిచయాలను వాడుకుంటూ.. అనేక మంది నాయకులను తెరాసలో చేర్చుకున్నారు. తెలుగుదేశం నాయకుల సంఖ్య పరంగా బలహీన పడింది. 2018 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో పొత్తు ద్వారా పార్టీకి కొంత జవసత్వాలు ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు గానీ.. అప్పటికే కాంగ్రెస్ బలమే తగ్గిపోయి ఉండగా ఆ ప్రయోగం వికటించింది. తర్వాత పరిణామాల్లో తెలంగాణ తెలుగుదేశానికి సారథిగా ఉన్న ఎల్.రమణ కూడా తెరాసలో చేరిపోయారు. బక్కని నర్సింహులును పార్టీ అధ్యక్షహోదాలో కూర్చోబెట్టినప్పటికీ.. పార్టీ చురుగ్గా రాష్ట్రవ్యాప్త అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో మందగమనంలోనే పడింది.
చంద్రబాబు వ్యూహం మార్చారు. పార్టీలో ఒకప్పటి సీనియర్ నాయకుడు, మధ్యలో సొంత పార్టీ కూడా ప్రారంభించి తిరిగి పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ కు పగ్గాలు అప్పగించారు. అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తూ కాసాని ప్రమాణం చేసే కార్యక్రమం గురువారం జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కూడా నిర్వహించనున్నారు. తెలంగాణలో పూర్వవైభవం దిశగా పార్టీ పునరుజ్జీవానికి కసరత్తు ప్రారంభించారు. కాసాని జ్ఞానేశ్వర్ చురుగ్గా ప్రజల్లో తిరుగుతూ పనిచేసే నేత కావడంతో.. పార్టీలో కూడా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ప్రతినెలా కనీసం ఒక్కరోజైనా తెలంగాణ పార్టీ నాయకులతో సమావేశం అవుతూ దిశానిర్దేశం చేయదలచుకుంటున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉన్న నేపథ్యంలో వీరి ప్రయత్నాలు ఎలా సాగుతాయో చూడాలి.