అన్న అడుగేస్తే మాస్.. అన్న నిల్చుంటే మాస్.. మ..మ మాస్ అటూ ఓ మాస్ హీరో గురించి వర్ణించే సినిమా పాట మంచి జోరుగా సాగిపోతుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పరిస్థితి అంతకంటె భిన్నంగా ఏమీ లేదు. చంద్రబాబునాయుడు రోడ్ షో అంటే నిషేధం, మీటింగు అంటే నిషేధం, నియోజకవర్గ పర్యటన అంటే నిషేధం, కార్యకర్తల పరామర్శ అంటే నిషేధం..గట్టిగా చెప్పాలంటే ఆయన అడుగు పెడితే చాలు దాన్ని నిషేధిస్తూ ఏదో ఒక చట్టం అమల్లోకి తెచ్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు.
విపక్షాల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. చూస్తున్న వారికి ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. అణచివేత అనేది మరీ ఇన్ని రకాలుగా ఉంటుందా? అని వాళ్లు చకితులు అవుతున్నారు. ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా చేయడానికి ప్రభుత్వం ఈ కొత్త సంవత్సరంలో జీవో నెం.1 తీసుకువచ్చింది. సీపీఐ రామకృష్ణ కోర్టుకు వెళ్లడంతో ఆ జీవో కాస్తా సస్పెండ్ అయింది.
ఆ జీవో ముసుగులో.. కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటించదలచుకుంటే.. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాలు అడ్డంకులు సృష్టించారో అందరూ గమనించారు. తెలుగుదేశం కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు. చంద్రబాబును అటూ ఇటూ కదలనివ్వకుండా పార్టీ కార్యాలయానికి, కొన్ని చిన్న సమావేశాలకు మాత్రం పరిమితం చేశారు. ఈలోగా జీవో సస్పెండ్ అయింది. ఒకసారి ప్రతిపక్షాలను అణచివేయదలచుకున్న తరువాత.. జీవో లేకపోతే మాత్రం మాకు చేతకాకుండా పోతుందా? అన్నట్టుగా పోలీసులు రెచ్చిపోతూనే ఉన్నారు.
పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన వారి కార్యకలాపాలను వైసీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకోవడం చాలాకాలంగా జరుగుతూనే ఉంది. కనీసం ఇంట్లోంచి కదలనివ్వకుండా విపక్ష నాయకుల్ని నిర్బంధిస్తున్నారు. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం కట్టిన ఫ్లెక్సిలను తొలగించేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు దాడులు చేశారు. దానికి తోడు తెదేపా కార్యకర్తల మీదనే పోలీసు కేసులు నమోదు అయ్యాయి. వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
పీలేరు సబ్ జైల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్తే .. అప్పుడు కూడా పోలీసు ఆంక్షలే. తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ పోలీసు యాక్ట్ 30 అమల్లోకి వస్తుందా? అంటూ చంద్రబాబునాయుడు ప్రశ్నించడం తటస్థుల్ని ఆలోచింపజేస్తోంది. పెద్దిరెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు హెచ్చరించారు.
చంద్రబాబు అడుగు తీసి అడుగేస్తే.. నిషేధాజ్ఞలే!
Wednesday, January 22, 2025