2024 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు గెలిస్తే గనుక.. ఇప్పుడు ప్రజలకు అందుతున్న సంక్షేమపథకాలు అన్నీ తక్షణం ఆగిపోతాయనేది వైసీపీ నాయకుల ప్రచారం. కేవలం అలాంటి మాటలతో ప్రజలను భయపెట్టడం ద్వారా మాత్రమే.. చంద్రబాబును ఓడించాలని, ఆయనను ప్రజలకు దూరం చేయాలని వైసీపీ కుట్ర పన్నుతున్నది. పెన్షన్లను ఇంటింటికీ అందించే వాలంటీర్లు, వారి వెంట పార్టీ నిఘా కోసం వెళ్లే గృహసారథులు, కన్వీనర్లు అందరితో ఇదే మాట చెప్పిస్తున్నారు. ‘చంద్రబాబు గెలిస్తే.. ఈ డబ్బు మీకు రాదు’ అనే మాట చెప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన గురించి ప్రత్యర్థులు చేస్తున్న ఇలాంటి విషప్రచారాన్ని తిప్పికొట్టడం చంద్రబాబుకు చాలా పెద్ద అసైన్ మెంట్ అయిపోయింది. ఈ పథకాలేమీ ఆగవు అని ఆయన ప్రతి వేదిక మీద చెప్పుకోవాల్సి వస్తోంది. అలాగే తాజాగా తాను గెలిస్తే.. మరింత సంక్షేమం అమలవుతుందని కూడా చంద్రబాబు చెబుతున్నారు. అంటే మరింతగా ప్రజలకు పంచిపెట్టే పథకాలకు చంద్రబాబు సిద్ధమవుతారా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
సాధారణంగా చంద్రబాబునాయుడు ఉదారవాద పంపకాల పథకాలకు వ్యతిరేకం. ఆయన హామీలు చేసే పనులు వ్యవస్థను కాపాడే విధంగా మాత్రమే ఉంటాయి. వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి కాన్సంట్రేట్ చేస్తారు. అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడుతూ.. తద్వారా సంక్షేమం వచ్చేలా చేస్తారు. అనేది ఆయన గత పాలన తీరు మీద ఉన్న జనాభిప్రాయం. 2004 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్తు హామీ ఇచ్చినప్పుడు.. చంద్రబాబుకు కూడా అలాంటి సలహాలు వచ్చాయి. అయితే ఆయన వినిపించుకోలేదు. ఉచిత విద్యుత్తు వ్యవస్థను నాశనం చేస్తుంది.. ఇలాంటి హామీలు మనం ఇవ్వకూడదు అని చెప్పారు. ఫలితం ఓడిపోయారు. ఆ తర్వాత ఉచిత విద్యుత్తు కాదు కదా.. రుణమాఫీ కూడా ప్రకటించి గెలిచారు.
ఇప్పుడు మరింత మారిపోయినట్టుగా, తాను గెలిస్తే మరింత సంక్షేమం ఉంటుందని అంటున్నారు. చంద్రబాబులో వస్తున్న ఈ తేడా కొన్ని వర్గాల ప్రజలకు చాలా రుచికరంగా ఉండవచ్చు గాక. కానీ రాష్ట్ర సమష్టి ప్రయోజనాలను గమనించినప్పుడు ఈ తేడా మంచిదా చెడ్డదా అనే చర్చ రేకెత్తుతుంది. మంచి చెడులు కాలం నిర్ణయిస్తుంది. కానీ.. ఇలాంటి హామీలు చంద్రబాబు మళ్లీ నెగ్గడానికి ఆయనకు ఉపయోగపడవచ్చు. లబ్ధిదారుల ఎంపికలో నిర్దిష్టత, సహేతుకమైన ధోరణులు లేకుండా చేసుకుంటూ పోతే గనుక.. పార్టీ నెగ్గవచ్చు గానీ.. రాష్ట్రం దెబ్బతింటుంది.
చంద్రబాబులో వచ్చిన ఈ తేడా మంచిదేనా?
Tuesday, November 12, 2024