చంద్రబాబును వాడుకోవాలనుకుంటున్న వైఎస్ఆర్ ఆత్మ!

Thursday, January 23, 2025

సాధారణ పరిస్థితిలో అయితే ఆయన నోటి నుంచి చంద్రబాబు గురించి ఒక్క పాజిటివ్ మాట అయినా ఆశించలేం! వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి, సోనియా కుటుంబ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ గురించి తప్ప మరొకరి గురించి ఆయన పాజిటివ్ మాటలు చెబుతారని ఊహించలేం. అలాంటి వ్యక్తి- చంద్రబాబు నాయుడుని అదే పనిగా పొగుడుతున్నారు. ఆయన  కార్యకుశలత గురించి కితాబులు ఇస్తున్నారు. జాతీయస్థాయిలో ఎన్డీఏకు సారధ్యం వహించిను అనుభవం అని, ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అలా హఠాత్తుగా చంద్రబాబు కీర్తనలు అందుకుంటున్న సదరు నాయకుడు ..  వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా తెలుగు ప్రజలకు చిరపరిచితుడైన కేవీపీ రామచంద్రరావు.

చంద్రబాబు నాయుడు ను అదే పనిగా కీర్తిస్తూ.. ‘దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు కాగల గొప్పవారు మీరు, దేశంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై జరగవలసిన పోరాటంలో మీరు ముందు ఉండండి, మీ వెనక మేముండి నడిపిస్తాం’ అని కెవిపి అంటున్నారు. చంద్రబాబు మీద ఆయనలో హఠాత్తుగా వెల్లువెత్తుతున్న ఈ ప్రేమ అంత స్వచ్ఛమైనది ఏమీ కాదు! కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఈ మాటలు అంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకూ ‘దేశ రాజకీయ పరిస్థితులపై పోరాటం’ అనే మాట ద్వారా ఆయన నిర్వచిస్తున్నది ఏమిటంటే.. మోడీకి వ్యతిరేకంగా పోరాడడం. జైలు శిక్ష తర్వాత రాహుల్ గాంధీ పై పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటుపడిన నేపథ్యంలో అందుకు వ్యతిరేకంగా గళమెత్తాలనేది కేవీపీ రామచంద్రరావు కోరిక. రాహుల్ భజన కోసం ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నంలో ఆయన చంద్రబాబును శరణు అంటున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబుతో రాహుల్ అనుకూల వ్యాఖ్యలు చేయించి, బాబును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాలని చూస్తున్నట్టుంది.

నిజానికి రాహుల్ మీద పడిన అనర్హత వేటు విషయంలో చేసే పోరాటమే అసంబద్ధమైనది. పైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే పోయేదానికి కాంగ్రెస్ నాయకులు అదే పనిగా సాగదీసి రాద్ధాంతం చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగిపోయింది అని గోల పెడుతూ ప్రజల సానుభూతి పొందాలని కుట్ర రచన చేస్తున్నారు. వారు ఎలాంటి వ్యూహాలు వండుకున్న పర్వాలేదు కానీ, వారి కుట్రలలో బిజెపి పట్ల మితవాద వైఖరిని అవలంబిస్తున్న తెలుగుదేశం లాంటి పార్టీలను కూడా భాగస్వాములను చేయాలని ఆలోచించడమే అసమంజసంగా ఉంది.

రాహుల్ కోసం మోడీపై పోరాడడానికి చంద్రబాబును యుద్ధంలో ముందుండి నడిపించాలని పిలుపు ఇస్తున్న కెవిపి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటం విషయంలో ఏనాడైనా పెదవి కదిపారా అనేది సామాన్యులకు కలుగుతున్న సందేహం. ప్రజల కష్టాల విషయానికి వస్తే ‘‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు మాస్టారు’’ అనే ముసుగు తగిలించుకుని బతికే ఇలాంటి పెద్దలు- రాహుల్ మీద పడిన తాత్కాలిక అనర్హత వేటు విషయంలో చేస్తున్న యాగీ ప్రజలకు కంపరం పుట్టిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles