చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని అంగళ్లు వద్ద అల్లర్లు చెల్లరేగాయి. వైసిపి నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడడం.. పోలీసులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ కట్టడి చేయడానికి పూనుకోవడం వలన అల్లర్లు జరిగినట్టుగా భావిస్తున్నారు. పోలీసులు మాత్రం అల్లర్లు జరిగిన రోజు నుంచి తెలుగుదేశం నాయకుల మీదనే పూర్తిస్థాయిలో నేరారోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడడం వలన సుమారు 50 మందికి పైగా పోలీసులు తీవ్రంగా గాయపడినట్లుగా జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అదే రోజు ప్రకటించారు. ఈ అల్లర్లకు సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలను పూర్తిస్థాయిలో ఇరికించేలాగా కేసులు నమోదు అవుతాయని అందరూ భావించారు. మొత్తానికి కురబలకోట మండలం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. అనూహ్యం కాకపోయినప్పటికీ.. చంద్రబాబు నాయుడును ఏ 1 గా చేరుస్తూ 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు దేవినేని ఉమామహేశ్వర రావు అమర్నాథ్ రెడ్డి రాంగోపాల్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దమ్మాలపాటి రమేష్ తదితరులు అందరు కేసులు నమోదు అయిన వారిలో ఉన్నారు. ఏకంగా వీరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం గమనార్హం.
చంద్రబాబు నాయుడు ను ఏదో ఒక రకంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడమే లక్ష్యంగా ఈ కేసులు నమోదు చేసినట్లుగా కనిపిస్తోంది. అల్లర్లు జరిగింది నిజమే అయినప్పటికీ అల్లర్లలో పాల్గొన్న వర్గం వేరు. దానితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న కార్యకర్తల మీద ఎలాంటి కేసులు పెట్టినప్పటికీ పోలీసులు సమర్ధించుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా జరగలేదు. అల్లర్లకు ప్రేరేపించారు అనే నెపం చూపిస్తూ.. చంద్రబాబు నాయుడు సహా ప్రముఖ నాయకులందరినీ నిందితులుగా చేర్చి హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
సాధారణంగా తెలుగుదేశం నాయకులు జగన్ గురించి పదేపదే ఏ 1 అని వ్యవహరిస్తూ ఉంటారు. అక్రమాస్తుల కేసులో జగన్ మొదటి నిందితుడు అనే ఉద్దేశంతో హేళన చేస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబును కూడా ఏ 1 గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఆయనను ఏ 1 అంటూ నిందించడానికి వైసిపి నేతలకు ఒక అవకాశం చిక్కినట్టే. పోలీసులు కేసు నమోదు చేయగలిగారు గానీ, విచారణ పర్వం పూర్తయ్యే లోగా ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
చంద్రబాబును అరెస్టు చేయడమే లక్ష్యం!
Wednesday, December 18, 2024