చంద్రబాబుకు అనుకూలంగా సోము వీర్రాజు మాటలు!

Sunday, December 22, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాల కూటమి పరంగా రాజకీయ వాతావరణం మారుతున్నదా? తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి ససేమిరా అంటూ వచ్చిన రాష్ట్ర బిజెపి సారథి సోము వీర్రాజు కూడా మెత్తబడుతున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత.. అక్కడి కమలదళం పెద్దలతో మంతనాలు సాగించివచ్చిన తర్వాత.. వాతావరణంలో మార్పులు వస్తున్నట్లుగా, సమీకరణాలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీనుంచి సోము వీర్రాజు మాట్లాడుతున్న మాటలు కూడా.. చంద్రబాబునాయుడుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్రంలో బిజెపి ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో, సోము వీర్రాజు నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎలా అప్రకటిత ఊడిగం చేస్తున్నదో ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు రోజులకే సోమును ఢిల్లీ పెద్దలు పిలిపించారు. అయితే ఇటీవలే తన అధ్యక్ష పదవికి, ఎన్నికలుపూర్తయ్యే దాకా ఎక్స్‌టెన్షన్ పొందిన సోము వీర్రాజుకు ఢిల్లీలో అక్షింతలు తప్పవని అందరూ భావించారు. ఆయనను అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పిస్తారని, సత్యకుమార్ చేతిలో పగ్గాలు పెడతారని, నెమ్మదిగా జగన్ వ్యతిరేకతను పార్టీలో పెంచి.. తర్వాత.. ఎన్నికల సమయానికి తెలుగుదేశంతో జట్టుకట్టేలాగా.. పవన్ కోరిక తీరేలా మూడుపార్టీలు జట్టుగా పోటీచేసేలా వాతావరణం మారుతుందని కొందరు అంచనా వేశారు.
అయితే సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడి పరిణామాలు ఏం జరిగాయో, ఆయనకు ఏ మేరకు క్లాస్ పీకారో తెలియదు. కానీ, ఢిల్లీలో ఆయన మాటలు కాస్త చంద్రబాబును పొగుడుతున్నట్టుగా ఉన్నాయి. ఇళ్ల నిర్మాణం విషయంలో ఆయన జగన్ ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. కేందప్రభుత్వం సొమ్ములతో ఇళ్లు కడుతూ.. రాష్ట్రప్రభుత్వం తమ సొంత పథకంలాగా ప్రచారం చేసుకుంటున్నదని తప్పుపట్టారు. పక్కాఇళ్లకు అచ్చంగా వైసీపీ పార్టీ రంగులు వేస్తున్నారంటూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి ఏపీలో ఇళ్ల నిర్మాణ పరిస్థితులను, గైడ్ లైన్స్ ఉల్లంఘన ను గమనించాలని కోరారు. జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకుంటున్నారని, ఆ కాలనీల్లో ఉన్నవి ‘మోడీ అన్న ఇళ్లు’ అనే సంగతి గుర్తుంచుకోవాలని సోము అంటున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం, అంటే చంద్రబాబు హయాంలో, నిర్మించిన మూడు లక్షల ఇళ్లను కూడా ఇప్పటిదాకా లబ్ధిదారులకు కేటాయించకుండా జగన్ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శలు చేయడం విశేషం. చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల కిందటే.. తాము లక్షల ఇళ్లు నిర్మిస్తే ఇంకా వాటిని ప్రజలకు కేటాయించలేదంటూ.. జగన్ సర్కారుకు సెల్ఫీ చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోము మాటలు చంద్రబాబును సమర్థిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. ఢిల్లీ పెద్దల అక్షింతలతో సోము వీర్రాజు నెమ్మదిగా తన తీరు మార్చుకుంటున్నారా, చంద్రబాబు అనుకూల వైఖరి పెంచుకుంటున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles