ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అద్భుతమైన వాతావరణం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వరసగా మూడుసంవత్సరాలుగా ప్రథమస్థానంలో ఉంది.ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టదలచుకుంటే మేం 21 రోజుల్లో అనుమతులు ఇచ్చేస్తాం. మీ వ్యాపారాలకు అన్ని రకాలుగా సహకారం అందిస్తాం.900 కిమీల పైబడిన సముద్రం తీరం ఉంది. ఆరు పోర్టులు ఉన్నాయి.. మీరు చాలా గొప్పగా వ్యాపారాలు చేసుకోవచ్చు.. ఇలా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక ఆకర్షణీయమైన విషయాలను ఢిల్లీ సమావేశంలో ఇన్వెస్టర్ల ముందు ప్రకటించారు. అయితే.. ఇన్వెస్టర్లు అందరూ ఆయన మాటలను పూర్తిగా విశ్వాసంలోకి తీసుకున్నట్టేనా? జగన్ మాటలను నమ్మి.. ఎంత మేర పెట్టుబడులు రాబోతున్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
నిజానికి గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో రాష్ట్ర అధినేత ఎలాంటి ప్రసంగం చేస్తారో, మాటలు చెబుతారో.. అవన్నీ ఆయన ఈ సన్నాహక సదస్సులోనే చెప్పేశారు. వివిధ దేశాల ప్రతినిధులతో ఈ సదస్సు జరిగింది. అయితే జగన్ మాటలకు దక్కగల మన్నన ఎంత? పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడే ముందు ఇన్వెస్టర్లు ఇంకా అనేకానేక అంశాలు పరిశీలించుకోకుండా ఉంటారా? అనే సందేహాలు పలువురిలో ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసేవారు ఇలాంటి అంశాలు కొన్ని పరిగణించే అవకాశం ఉంది.
ఒకటి- రాష్ట్రంలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పుష్కలంగా ఉన్నదనే ప్రచారం బాగా జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొందర పడతారా? జగన్ సర్కారు హయాంలో ఒప్పందాలు చేసుకుంటే, పెట్టుబడులు పెడితే.. తర్వాత ప్రభుత్వం మారితే గనుక.. పరిస్థితులు, ఇచ్చిన ఆఫర్లు కూడా మారుతాయనే భయం వారికి ఉండదా అనేది ప్రధాన అంశం. అంత తొందర ఏముంది. ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్నప్పటికీ.. పెట్టుబడులు పెట్టడానికి ఎన్నికల వరకు వేచి ఉండచ్చు కదా అనే ధోరణి వారిలో ఉంటుంది.
రెండు- పారిశ్రామిక వేత్తలు తమ సొంత ఎంక్వయిరీలు తాము చేసుకుంటారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే.. ప్రభుత్వం ఎన్ని రకాల ఆఫర్లు ఇస్తున్నదో జగన్ సభలో చెప్పి ఉండవచ్చు. కానీ.. ఆల్రెడీ ఏపీలో ఉన్న పరిశ్రమలకు జగన్ సర్కారు ఎలాంటి సహకారం అందిస్తున్నదో, లేదా, ఎలా వేధిస్తున్నదో.. వారు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. అదే జరిగితే.. అన్నివైపులనుంచి సానుకూల పవనాలు జగన్ ప్రభుత్వానికి ఉండకపోవచ్చు.
మూడు- విశాఖకు కొన్ని నెలల్లోనే రాజధాని తరలిపోతుందని జగన్ స్పష్టం చేశారు. అయితే.. ఇందుకు న్యాయపరమైన చిక్కులున్నాయనేది అందరి భావన. ముందు ఆ చిక్కులనుంచి బయటపడి విశాఖకు రాజధాని తరలించే దాకా, జగన్ మాటలు ఆచరణలో నిజమేననే నమ్మకం కలిగేదాకా ఇన్వెస్టర్లు ముందుకు రాకపోవచ్చు.
ఇలా రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వ పెద్దలో త్వరలోనే విశాఖకు అంటూ చాలా కాలంగా ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. కానీ న్యాయనిపుణులు మాత్రం.. హైకోర్టు తీర్పు మీద సుప్రీంలో ఏ సంగతీ తేలకుండా రాజధాని విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయడం అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. రాజధాని తరలింపు అనే మాటతో ప్రజలను బుకాయించినంత ఈజీగా ఇన్వెస్టర్లను కూడా బుకాయించడం సాధ్యమేనా.. అంత త్వరగా వారు బుట్టలో పడతారా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ జగన్ బుట్టలో పడతారా?
Friday, November 15, 2024